నకిలీ పత్రాలతో వాహనాలను రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలతో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అనంతపురం జిల్లావ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. నిన్న ఉదయం వారిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇద్దరినీ వేరువేరుగా విచారించి కడప జైలుకు తరలించారు. రెడ్డిపల్లి, తాడిపత్రి జైళ్లకు తరలించాలని భావించినా శాంతిభద్రతల సమస్యలు, ఇతర సమస్యలు తలెత్తటంతో వారిని కడప సబ్ జైలుకు తరలించారు. 
 
గత ఐదేళ్లలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండటంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని జేసీ సోదరులు చేసిన నేరాలు అన్నీఇన్నీ కావని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. 40 సంవత్సరాల క్రితం ఒక బస్సుతో మొదలైన ప్రస్థానం... కోట్ల రూపాయల మాఫియా సామ్రాజ్యంగా విస్తరించిందని.... బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చి ఎంతోమందిని ముంచారని అధికారుల విచారణలో తేలింది. 
 
జేసీ సోదరులు ఏకంగా పోలీసుల సంతకాలనే ఫోర్జరీ చేయడం గమనార్హం. ఒక పర్మిట్ తో రెండు మూడు బస్సులు నడపడం, అనుమతిలేని రూట్లలో బస్సులు నడపడం లాంటి ఘటనలు కోకొల్లలు. బస్సు డ్రైవర్ల అనుభవ లేమి కారణంగా దివాకర్ ట్రావెల్స్ బస్సులు ఎంతో మంది ప్రయాణికుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి. జేసీ సోదరులు పోలీసుల సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ స్టాంపులతో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 
 
ఆ తరువాత ఆ వాహనాలను తెలంగాణలో విక్రయించగా అవి ఫోర్జరీ డాక్యుమెంట్లు అని అధికారులు గుర్తించారు. అధికారులు అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆరుగురిపై కేసు నమోదైంది. ఈ కేసులే కాక మరికొన్ని కేసుల్లో తదుపరి విచారణ కొరకు వన్ టౌన్ పోలీసులు పీటీ వారెంట్ వేయనున్నారని సమాచారం అందుతోంది. పోలీసులు దివాకర్ ట్రావెల్స్ భారీగా అక్రమాలకు పాల్పడటంతో 25 కేసులు నమోదు చేశారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: