టీడీపీని ఎంతమంది ఎమ్మెల్యేలు వీడతారనే విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఈ క్రమంలోనే మరికొందరు టీడీపీని వీడతారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు, ఏలూరి సాంబశివరావు, మంతెన రామరాజు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, వాసుపల్లి గణేశ్, స్వామి, గణబాబు...వీరంతా ఆయా సందర్భాల్లో పార్టీని వీడతారని వార్తలు వచ్చాయి.

 

అయితే ఇటీవల ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్‌లు పార్టీ మారతారని టీడీపీ అనుకూల మీడియాలోనే వార్తలు వచ్చాయి. కానీ ఆ ఇద్దరు పార్టీని వీడటం లేదని, టీడీపీలో  ఉంటున్నామని ప్రకటించి, యాక్టివ్ గా పనిచేసుకుంటున్నారు. కానీ ఎక్కువసార్లు పార్టీ మారతారని వార్తలు వచ్చింది...అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మీదే. పలు సందర్భాల్లో ఆయన టీడీపీని వీడి, జగన్‌కు జై కొట్టనున్నారని ప్రచారం జరిగింది.

 

అలాగే గ్రానైట్ వ్యాపారాల్లో ఉన్న ఇబ్బందులతో ఆయన పార్టీని వీడటం గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. కానీ ఇంతవరకు ఆయన పార్టీ మారింది లేదు. మహానాడు కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. కానీ ఎప్పుడైతే మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు టీడీపీని వీడి వైసీపీ కండువా కప్పుకున్నారో..అప్పుడే గొట్టిపాటి కూడా రెడీగా ఉన్నారని వార్తలు వచ్చాయి. శిద్ధా తన గ్రానైట్ వ్యాపారాల కోసమే వైసీపీలోకి వెళ్లారనేది బహిరంగ రహస్యమే.

 

ఈ క్రమంలోనే గొట్టిపాటి కూడా జంపింగ్‌పై కూడా క్లారిటీ వచ్చేసినట్లే తెలుస్తోంది. తాజాగా గొట్టిపాటి ర‌వి... మాజీ మంత్రి శిద్దా, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావులతో ఓ హోటల్‌లో భేటీ అయి.. తాజా ప‌రిస్థితిపై స‌మీక్షించారని తెలుస్తోంది. పార్టీలో ఉండి ఇబ్బందులు పడటంకంటే వ్యాపారం కోసం మార్పు కోరుకోవ‌డ‌మే మంచిద‌ని గొట్టిపాటి  నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే ఈయన పక్కాగా పార్టీ మారిపోతారనే దానికి గట్టి ఉదాహరణ ఏంటంటే...ఇటీవల టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

 

ఇక ఈ అరెస్ట్‌పై టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతూ, తమ నేతలకు సంఘీభావం తెలుపుతున్నారు. కానీ గొట్టిపాటి దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. అలాగే ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో కూడా వీటిపై స్పందించలేదు. ఇక వీటిని బట్టిని చూస్తుంటే గొట్టిపాటి టీడీపీని వీడటానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: