2019 ఎన్నికలు ముగిసి, జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ ఘోరంగా ఓడిపోయి కూడా అదే సంవత్సరం పూర్తి అయింది. అయితే ఈ ఏడాదిలో జగన్ బలం ఏమన్నా తగ్గి, చంద్రబాబు బలం ఏమన్నా పెరిగిందా? అంటే పెద్దగా తేడా ఏమి లేదనే చెప్పాలి. జగన్ బలం పెరిగిందా...తగ్గిందా అనే విషయాన్ని పక్కనబెట్టేస్తే చంద్రబాబు బలం అయితే ఇంకా తగ్గిందనే చెప్పొచ్చు. జగన్ ఓ రేంజ్‌లో కొట్టిన దెబ్బకు చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి దిక్కులేకుండా పోయింది.

 

ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో టీడీపీని నడిపించే నాయకుడు లేడు. ఎన్నికల్లో ఓడిపోయాక చాలామంది టీడీపీ నేతలు వైసీపీ, బీజేపీల్లోకి వెళ్ళిపోయారు. ఇంకా కొందరు అడ్రెస్ లేరు. అలా టీడీపీకి నాయకత్వం లేని నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లా గన్నవరం ముందుంది. వల్లభనేని వంశీ టీడీపీని వీడాక ఆ నియోజకవర్గంలో టీడీపీకి దిక్కులేదు. ఇక విజయవాడ వెస్ట్‌లో జలీల్ ఖాన్ కుమార్తె షబానా అమెరికా వెళ్ళిపోయారు.

 

ఇటు గుంటూరులో గుంటూరు ఈస్ట్‌లో టీడీపీకి నాయకత్వం లేదు. మాచర్లలో చలమారెడ్డిని నియమించారు గానీ...కానీ ఆయన పెద్ద యాక్టివ్‌గా లేరు. అటు ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీకి దిక్కు లేదు. అలాగే యర్రగొండపాలెం, కందుకూరు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అడ్రెస్ లేదు. నెల్లూరు, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో టీడీపీ అసలు ఉందా? లేదా అన్నట్లు ఉంది. అనంతపురం జిల్లాలో ధర్మవరం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన నాయకత్వం లేదు.

 

పశ్చిమగోదావరి కొవ్వూరు, తూర్పుగోదావరి రామచంద్రాపురం, పి గన్నవరం, విశాఖలో భీమిలి నియోజకవర్గాల్లో టీడీపీకి నాయకులు లేరు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఇంకా కోలుకోలేదు. 2019 ఎన్నికల్లో జగన్ కొట్టిన దెబ్బకు ఇంకా బాబు కోలుకోలేదని ఈ నియోజకవర్గాలని చూస్తే అర్ధమవుతుంది. ఇక జగన్ దెబ్బకు బాబు భవిష్యత్‌లో కూడా కోలుకోలేరేమో?

మరింత సమాచారం తెలుసుకోండి: