దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ రెండు రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న పలు రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించిన మోదీ... నేడు మిగిలిన రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్, సీఎం జగన్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కానున్నారు. నిన్న నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ పంజాబ్ మోడల్ ను అనుసరించాలని సీఎంలను కోరారు. 
 
పంజాబ్ లో మాస్క్ లేకుండా బయటకు వచ్చేందుకు అనుమతించడం లేదని..... మాస్క్ లేకుండా వచ్చిన వారికి భారీగా జరిమానాలు విధిస్తూ ఉండటంతో ప్రజలు మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తున్నారని చెప్పారు. నిన్న మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించటంతో పాటు హాజరైన సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్ల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఈరోజు వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ కానున్నారు. 
 
మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు సమావేశానికి హాజరు కానున్నారు. సీఎంల నుంచి అభిప్రాయాలను సేకరించిన అనంతరం మోదీ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మోదీకి షాక్ ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యేందుకు ఆమె సుముఖంగా లేరని తెలుస్తోంది. 
 
ప్రధాని మోదీ కరోనా తీవ్రత, లాక్ డౌన్ అమలు, భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడేందుకు కొద్ది మంది సీఎంలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఆ జాబితాలో మమతా బెనర్జీ పేరు లేకపోవడంతో ఆమె సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశం జరగనుండటంతో కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనలు వస్తాయో అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కేంద్రానికి లాక్ డౌన్ అమలు చేసే ఉద్దేశం లేకపోయినా ప్రజలు లాక్ 'డౌన్ అమలు చేస్తే కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని అభిప్రాయపడుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: