కరోనాతో ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నారు వైద్యులు. కరోనా బారిన పడే ప్రమాదం దగ్గర లో ఉన్నా వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈలు) ద్వారా వారు వైరస్‌ను దగ్గరకు చేరకుండా చేయగలుగుతున్నారని బీఎంజే వైద్య జర్నల్​లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. వైద్యులు, వైద్య సిబ్బంది ఇంటికి దూరంగా ఉండి... వ్యక్తిగత దూరం పాటిస్తూ పని చేయటం మూలంగా వైరస్‌ సంక్రమణ తక్కువ స్థాయిలో ఉందని చైనా సన్‌ యాట్‌-సేన్‌ యూనియవర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు.

 


వైద్య సిబ్బందికి రక్షణ కిట్లు తప్పనిసరి అంటున్న పరిశోధక బృందం వాటిని సరైన పద్దతిలో ఉపయోగించే విధానంపై తర్ఫీదు ఇవ్వాలని సూచించింది. కిట్ల పంపిణీని విస్తరించాలని పేర్కొంది. బర్మింగ్‌ హమ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం సైతం ఈ పీపీఈ కిట్ల సామర్థ్యంపై పరిశోధనలు చేశారు. వుహాన్‌లో 6 నుంచి 8 వారాల పాటు కరోనా రోగులకు చికిత్స అందించిన వైద్యులపై తాము పరిశోధనలు చేశామన్నారు. సరైన పద్దతిలో పీపీఈ కిట్లని ఉయోగించడం వల్ల వారు వైరస్‌ బారిన పడలేదని వెల్లడించారు.

 

 

అయితే వైరస్‌ ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు.. పీపీఈ కిట్లు ఎంత మేరకు రక్షణ ఇస్తాయన్నది ఇంకా తెలియాల్సి ఉందన్నారు. మహమ్మరి కరోనా వ్యాప్తి నివారణకు విస్తృత స్థాయిలో పరీక్షలు చేయడం ఒక్కటే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే ఉద్బోధ చేసింది. అయితే భారత్​లో మాత్రం వైరస్​ నిర్ధరణ పరీక్షలు జనాభాతో పోలిస్తే అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరోవైపు ఇతర వ్యాధులతో పోరాడుతున్న వారికి మెడమీద కత్తిలా వేలాడుతుంది కరోనా. ఈ క్రమంలో రాపిడ్​ టెస్టింగ్​ కిట్లను తగిన స్థాయిలో సమకూర్చుకుని.. పరీక్షల వేగం పెంచాల్సి ఉంది. కొవిడ్​ ల్యాబ్​ల సంఖ్య పెంచి ఆసుపత్రులపై భారం తగ్గించాలి.

 

 

పీపీఈ కిట్లు వైద్య సిబ్బందికి శ్రీరామరక్షగా ఉన్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న నర్సులు, వైద్యులకు మాస్కులు, గ్లౌజులు రక్షణ కల్పిస్తున్నాయని స్పష్టం చేశాయి. అయితే, పీపీఈలను సరైన పద్దతిలో ఉపయోగించాలని సూచించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: