సోమవారం రాత్రి చైనా బలగాలు భారత జవాన్ల పై దాడి చేసి 20 మంది చనిపోవడానికి కారకులయ్యారు. దాడి జరిగిన మరుసటి రోజు మధ్యాహ్నం వేళ మిలటరీ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. అందులో ఒక కల్నల్ తో పాటు ఇద్దరు జవాన్లు మరణించారని ప్రకటించాయి. ఈ చనిపోయిన వారిలో సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్ కూడా ఉన్నారు. భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడే జవాన్లు మరణించారన్న వార్త మనందరి హృదయాలను కలచివేసింది. సూర్యాపేట జిల్లాకు చెందిన సంతోష్ కూడా మృతి చెందిన వారిలో ఉన్నాడు అన్న విషయం తెలిసిన అనంతరం తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.


చనిపోయాడన్న బాధ ఉంది, దేశం కోసం ప్రాణాలర్పించాడన్న గౌరవం కూడా ఉంది అంటూ కల్నల్ సంతోష్ తల్లి ఏడుస్తూ చెప్పడం ప్రతి ఒక్కరి మనసులను కలచివేస్తోంది. పుట్టెడు దుఃఖంలో ఉన్న సంతోష్ తల్లిదండ్రులను తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖులందరూ తమ వంతు గా ఓదార్చారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా కల్నల్ సంతోషం మరణవార్త విని దిగ్భ్రాంతికి చెందినట్టు తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. 

గాల్వన్ లోయ అమర వీరులకు సెల్యూట్. వాస్తవాధీన రేఖ వెంబడి గాల్వన్ లోయలో మన భద్రతా దళాలకు చైనా సేనలకి చోటు చేసుకున్న ఘర్షణల్లో మన దళాల నుంచి ముగ్గురు అమరులు కావడం కలవరపరచింది. దేశ రక్షణలో భాగంగా అమరులైన ఆ ముగ్గురు వీరులకీ నా తరఫున, జనసేన తరఫున నివాళి ఘటిస్తున్నాను. ఈ అమరుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ గారు ఉన్నారని తెలిసి బాధపడ్డాను. కోరుకొండ సైనిక్ స్కూల్ నుంచి సైన్యానికి వెళ్ళిన ఆ దేశభక్తుడిని ఈ నేల ఎన్నటికీ మరువదు. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. కల్నల్ సంతోష్ గారి భార్య, బిడ్డలకు కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి. అహరహం దేశ రక్షణలో నిమగ్నమై ఉన్న మన సేనలకు దేశం అంతా మద్దతుగా నిలవాల్సిన తరుణం ఇది. "మేమున్నాం.' అని దేశమంతా అమరుల కుటుంబాలకు బాసటగా నిలవాలి. గాల్వన్ లోయ అమర వీరులకు బాధాతప్త హృదయంతో సెల్యూట్ చేస్తున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి: