రాష్ట్రంలో విజయవాడ రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్‌గానే నడుస్తుంటాయి. ఎన్నికలు ఉన్నా...లేకున్నా...ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. ఇక ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సరే గెలుపు కోసం పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఇంకా నడుస్తూనే ఉంది. అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీలు ప్రతిష్టాత్మకమైన విజయవాడ కార్పొరేషన్‌ని కైవసం చేసుకోవాలని తెగ ఆరాటపడుతున్నాయి. అసలు ఎన్నికలు వాయిదా పడిన కూడా...రెండు పార్టీలు మాత్రం సైలెంట్‌గా గెలుపు కోసం చేయాల్సిన పనులు చేస్తున్నాయి.

 

వాస్తవానికి విజయవాడ కార్పొరేషన్ బరిలో రెండు పార్టీలు తలపడుతున్నాయి అని చెప్పడం కంటే, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)లు పోటీపడుతున్నారని చెప్పొచ్చు. అధికారంలో ఉన్నారు కాబట్టి కార్పొరేషన్ గెలుపుని వెల్లంపల్లి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. ఒకవేళ కార్పొరేషన్ చేజారితే ఆయన పరువు కాస్త పోతుంది. దీంతో గెలుపు కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు.

 

అయితే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి గెలుపు సులువు అనుకోవడం పొరపాటే. ఎందుకంటే విజయవాడలో టీడీపీ బలంగా ఉంది. మొన్న ఎన్నికల్లో నగర పరిధిలో ఉన్న మూడు సీట్లలో ఈస్ట్ సీటుని 15 వేల మెజారిటీతో గెలిచింది. అటు సెంట్రల్ సీటుని కేవలం 25 ఓట్లతో కోల్పోగా, వెస్ట్ సీటుని 7 ఓడిపోయింది. ఇక ముఖ్యమైన ఎంపీ సీటుని టీడీపీనే గెలిచింది. రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్నా సరే కేశినేని నాని విజయం సాధించారు.

 

పార్టీ ఇమేజ్‌తో పాటు, సొంత ఇమేజ్ తో కేశినేని విజయం సాధించారు. ఇప్పుడు విజయవాడ మేయర్ పీఠం దక్కించుకోవడం కోసం కుమార్తె శ్వేతని మేయర్ అభ్యర్ధిగా రంగంలోకి దించారు. మంత్రి వెల్లంపల్లికి వెస్ట్ వరకే బలం ఉంటే, కేశినేనికి ఈస్ట్, వెస్ట్, సెంట్రల్‌ నియోజకవర్గాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఓ రకంగా చూసుకుంటే కేశినేని ఇమేజ్ ముందు వెల్లంపల్లి ఇమేజ్ చాలా తక్కువే అని చెప్పొచ్చు. కానీ అధికారంలో ఉండటం వెల్లంపల్లికి అడ్వాంటేజ్. అలా అని గెలుపు సులువు కాదు. మొత్తానికైతే వెల్లంపల్లిని కేశినేని డామినేట్ చేస్తుండటంతో వైసీపీకి గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: