సాధారణంగా అధికార పార్టీలో ఆధిపత్య పోరు ఉండటం సహజమే. అయితే భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీలో మాత్రం ఈ ఆధిపత్య వ్యవహారాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. కొన్నిచోట్ల మంత్రులకు, ఎమ్మెల్యేలకు పొసగట్లేదు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు పడటం లేదు. అలాగే మరికొన్ని చోట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలకు సెట్ కావడం లేదు. ఈ ఏడాదిలో వైసీపీలో ఆధిపత్య పోరుకు సంబంధించి అనేక ఘటనలు జరిగాయి.

 

ఇప్పటికీ అవి నివురుగప్పిన నిప్పులాగానే ఉన్నాయని తెలుస్తోంది. నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే రజినిల మధ్య వివాదం కూడా అలాగే ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభల ఊరేగింపు విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేల వర్గాల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. కమ్మ సామాజికవర్గానికి చెందిన లావు...అదే సామాజికవర్గానికి చెందిన చిలకలూరిపేట వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని రజిని వర్గం వారు గుర్రుగా ఉన్నారు.

 

పైగా చిలకలూరిపేట వైసీపీ కమ్మ నేతలు ఏదైనా పని చేయించుకోవాలంటే రజిని దగ్గరకు వెళ్లకుండా, లావుని కలుస్తున్నారట. ఈ విషయంలో రజిని తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు నియోజకవర్గ వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే 2019 ఎన్నికల్లో జగన్ సీనియర్ నేత మర్రిని కాదనే రజినికి టిక్కెట్ ఇచ్చారు. ఎన్నికల్లో మర్రి వర్గం రజిని విజయం కోసం కష్టపడ్డారు. కానీ గెలిచాక ఆమె తమని పక్కనబెట్టేశారని మర్రి వర్గం అసంతృప్తితో ఉంది.

 

దీంతో వారు ఎంపీ లావు శ్రీకృష్ణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే తన నియోజకవర్గంలో ఎంపీ పెత్తనం పెరిగితే తనకు ఇబ్బంది అని రజిని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎక్కడికక్కడ ఎంపీ, మర్రిలకు చెక్ పెట్టడానికి చూస్తున్నట్లు సమాచారం. అయితే వీరిలో ఎవరోకరు తగ్గేవరకూ ఈ పంచాయితీ తెగేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: