ఎట్టకేలకు రాజ్యసభ ఎన్నికలు పూర్తి అయిన విషయం తెలిసిందే. పూర్తి మెజారిటీ ఉండటంతో వైసీపీ నాలుగు స్థానాలని క్లీన్ స్వీప్ చేసేసింది. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ కూడా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. తమకు గెలిచే బలం లేకపోయినా సరే చంద్రబాబు...వర్ల రామయ్యని పోటీకి దింపారు. గెలవమని తెలిసిన బాబు రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్ధిని పెట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది.

 

ఎలాగో టీడీపీని ముగ్గురు ఎమ్మెల్యేలు వీడారు. వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాంలు జగన్‌కు జై కొట్టారు. అయితే తమ అభ్యర్ధిని పోటీకి దించడం వల్ల, ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక ఈ ఎన్నికల్లోనే ఆ ముగ్గురుకు బాబు చెక్ పెట్టాలని, టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. విప్ ఇవ్వడంతో ఓటింగ్‌లో పాల్గొనే వారు.. ఎవరికి ఓటు వేశారో అనే విషయాన్ని ఎజెంట్‌కు తప్పకుండా చూపించాలి. దీంతో ఆ ముగ్గురు వైసీపీకి ఓటు వేస్తే వారిపై అనర్హత వేటు వేయొచ్చని బాబు అనుకున్నారు.

 

కానీ ఇక్కడే బాబు పప్పులు ఉడకలేదు. రెబల్ ఎమ్మెల్యేలు ముగ్గురు టీడీపీ‌కే ఓటు వేసినా అది చెల్లని విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒకటి అని పెట్టాల్సిన మొదటి ప్రాధాన్యతా స్థానంలో టిక్ మార్క్ పెట్టారు. వైసీపీకి ఓటు వేయలేకపోయిన తాము టీడీపీకి చెల్లని విధంగా ఓటు వేసి సరిపెట్టుకున్నారు. ఇక విప్ జారీతో బాబు వ్యూహాత్మకంగా ఈ విధంగా రెబెల్ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టగలిగిందని ఓ టీడీపీ అనుకూల మీడియా డప్పు కొడుతుంది.

 

అయితే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విప్‌కు దొరకకుండా తెలివిగా ఓట్లు చెల్లని విధంగా వేశారు. ఇక్కడ రెబల్ ఎమ్మెల్యేలే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ఆ మీడియా మాత్రం బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారని హడావిడి చేస్తోంది. ఇక రెబల్ ఎమ్మెల్యేలు ఇలా వ్యూహాత్మకంగా ఓట్లు వేసే స్కెచ్ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రూపొందించారని తెలుస్తోంది. ఓటింగ్ ఎలా వేయాలని తమ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చిన విజయసాయి...రెబల్ ఎమ్మెల్యేలకు చెల్లని విధంగా ఓట్లు వేసేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: