ఈ నెలలోనూ మెట్రో పరుగులు పెట్టే అవకాశం లేదు. కరోనా కేసులు పెరుగుతుండటంతో మెట్రోపై ఆంక్షల సడలింపునకు కేంద్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. దాదాపు ఈ మూడు నెలల వ్యవధిలో రూ.150 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు హైదరాబాద్​ మెట్రో వర్గాలు చెబుతున్నాయి.

 

మెట్రో రైళ్లు మరికొంత కాలం డిపోలకే పరిమితం కానున్నాయి. వీటి పునఃప్రారంభం ఈ నెలలో లేనట్లేనని అధికారులు అంటున్నారు. జూన్‌లో మొదలైన లాక్‌డౌన్‌ 5.0లో మరిన్ని సడలింపులను కేంద్రం సూచించింది. ఇందులో పరిస్థితులను బట్టి మెట్రో రైళ్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికీ మెట్రోపై ఆంక్షల సడలింపునకు కేంద్రం సుముఖంగా లేదని తెలుస్తోంది.

 

జనతా కర్ఫ్యూ నుంచి: 

జనతా కర్ఫ్యూ సందర్భంగా మెట్రో రైళ్లు మార్చి 22న నిల్చిపోయాయి. ఆ మరుసటి రోజు నుంచే రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో సేవలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అనంతరం ఒక్కోటి ప్రారంభమవుతున్నా.. నగరంలో ప్రజా రవాణాకు అనుమతి ఇవ్వలేదు. జూన్‌ మూడో వారంలో మెట్రో అందుబాటులోకి రావొచ్చనే అంచనాలు ఉండేవి. వైరస్‌ విజృంభిస్తున్నందున మరికొంత కాలం అనుమతి ఇవ్వకపోవడమే మేలనే భావనలో కేంద్రం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

 

మనం సిద్ధం: 

ప్రజా రవాణాకు సంబంధించి కేంద్రం పలుదఫాలు చేసిన సూచనలు, కొవిడ్‌-19 వ్యాప్తి కట్టడికి స్వయంగా రూపొందించుకున్న భద్రతా చర్యలతో రైళ్లను నడిపేందుకు హైదరాబాద్‌ మెట్రో సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఈ నెల మొదట్లో ట్రయల్‌రన్‌ చేశారు. మరింత పకడ్బందీ చర్యలు చేపడతామని చెప్పినా కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి వచ్చే వరకు మెట్రో పరుగులు పెట్టే అవకాశం లేదు. దాదాపు ఈ మూడు నెలల వ్యవధిలో రూ.150 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ఆంక్షల సడలింపుల అనంతరం మెట్రో రైళ్లను నడపాల్సి వస్తే.. సీట్ల మధ్య ఎడం పాటించడం, రైళ్లు, స్టేషన్లలో చేతులు తాకే ప్రదేశాలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయడం లాంటివి చేయడానికి మెట్రోవర్గాలు సిద్ధంగా ఉన్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: