కరోనాతో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం వరకు గాంధీ ఆసుపత్రిలో దాదాపు 195 మంది మృతి చెందారు. ఇందులో 35 శాతం మందికి ఇతర ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, కేవలం వైరస్‌ సోకడంతోనే కన్నుమూశారని వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్‌ వ్యాప్తంగా 3 వేల పైనే కేసులు నమోదయ్యాయి. అనేకమంది లక్షణాలతో పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇంట్లో ఒకరికి సోకినా మిగతా కుటుంబ సభ్యులకు వైరస్‌ సంక్రమిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎవరికి వారు అప్రమత్తంగా ఉంటూ కరోనాకు దొరకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

 


లక్షణాలు లేకుండానే... 

హైదరాబాద్ నగరంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా చాలామంది ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. మాస్క్‌లు ధరించకుండా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. కొందరైతే బైక్‌పై వెళుతూ రోడ్లపై ఉమ్మేస్తున్నారు. గుంపులు గుంపులుగా ఉంటూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. కొందరిలో కరోనా ఉన్నట్లు లక్షణాలు కన్పించకపోయినా పరీక్షలు చేస్తే పాజిటివ్‌ వస్తోంది. ఇలాంటి వారే వైరస్‌ వ్యాప్తి వాహకాలుగా మారుతున్నారు. వీరి వల్ల ఇంటా బయటా ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కరోనా సోకితే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, మధుమేహం, గుండె సమస్యలు, క్యాన్సర్‌ తదితర సమస్యలు ఉన్నవారిలో ఎక్కువమందిని మృత్యువు కాటేస్తోంది. ఇప్పటికే ఎలాంటి సమస్యలు లేకున్నా మృత్యువు దాడి చేస్తున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

 


బయటకు రాకపోవడమే ఉత్తమం: 

జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే పరీక్షలు చేయించుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రాకపోవడమే మేలంటున్నారు. కార్యాలయాలు, ఇతర పనులపై బయటకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి చేతులు కడుక్కోవాలి. తరచూ ఆసుపత్రులకు వెళ్లకపోవడమే ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: