హైదరాబాద్.. తెలుగు రాష్ట్రాల వారికి ఇదో స్వర్గ ధామం. ఏ ప్రాంతానికి చెందినవారైనా హైదరాబాద్ లో ఉండేందుకు ఇష్టపడతారు. చక్కటి వాతావరణం, సకల సౌకర్యాలు, ఎంత తక్కువ జీతం వచ్చినా బతికేయగల అవకాశాలు ఇందుకు కారణం. అందుకే హైదరాబాద్ కు వలసలు ఎక్కువ. ఒక్కసారి హైదరాబాద్ లో ఉండేందుకు అలవాటు పడిన వారు అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లడానికి ఇష్టపడరు.

 

 

కానీ ఇప్పుడు కరోనా హైదరాబాద్ వాసులను భయంకరంగా వణికిస్తోంది. తెలంగాణలో వచ్చే కరోనా కేసుల్లో నూటికి 90 శాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వస్తున్నాయి. తెలంగాణలో మొదటి నుంచీ ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఇక తాజాగా సోమవారం ఒక్కరోజే కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 700కు పైగా కరోనా కేసులు వచ్చాయి. కరోనా వచ్చిన మొదట్లో బాగానే కట్టడి చర్యలు తీసుకున్నా.. అన్ లాక్‌డౌన్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

 

 

కరోనా విజృంభణ జోరు బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం భాగ్యనగరంలో కరోనా జోరు చూస్తే త్వరలోనే చెన్నై, ముంబై, ఢిల్లీ స్థాయిలో కరోనా కేసులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులోనూ హైదరాబాద్ లో కరోనా టెస్టులు చాలా తక్కువగా చేస్తున్నారన్న వాదన ఉంది. ఇక పూర్తి స్థాయిలో కరోనా టెస్టులు జరిగితే రోజూ ఎన్ని వేల కరోనా కేసులు లెక్క తేలతాయో అర్థం కాని పరిస్థితి ఉంది.

 

 

ఇక హైదరాబాద్ అంటేనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు హడలిపోతున్నారు. హైదరాబాద్ లో ఉన్న తమవారికి ఫోన్లు చేసి జాగ్రత్తలు చెబుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగాల కోసం వచ్చిన వారు ఇప్పటికే హైదరాబాద్ నుంచి సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. హైదరాబాద్ లో విస్తృతంగా టెస్టులు చేయాలని తాజాగా కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇక ముందు ముందు హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుందోనని భాగ్యనగరవాసి బెంగపెట్టుకుంటున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: