పోలవరం ప్రాజెక్టు పనుల తీరుపై ఏపీ సీఎం జగన్ సమీక్షించారు. ఈ ప్రాజెక్టు విషయంలో జగన్ అధికారులకు కొన్ని టార్గెట్లు పెట్టేశారు. నవంబర్‌లో ఎట్టి పరిస్ధితుల్లో ప్రాజెక్టు గేట్లు అమర్చాలని అధికారులకు సూచించారు. వరదల వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముమ్మరంగా పునరావాస పనులు చేపట్టాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశం మొత్తం సాగునీటి ప్రాజెక్టులపై జరిగినా సీఎం ఎక్కువగా పోలవరం మీదనే ఫోకస్ చేశారు.

 

 

సమావేశంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి పై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. పనుల పురోగతిని వివరించిన అధికారులు.. ఆగస్టు తప్ప మిగిలిన సమయాల్లో స్పిల్‌వే పనులు నడిచేలా ప్రణాళిక వేసుకున్నామన్నారు. ఏప్రిల్‌లో 3 వేల మంది కూలీలు పనిచేశారన్న అధికారులు ప్రస్తుతం 2 వేల మంది పనిచేస్తున్నట్లు తెలిపారు. స్పిల్‌వేలో 52 పిల్లర్లు గతంలో సరాసరిన 28 మీటర్లు ఎత్తున ఉంటే ప్రస్తుతం 47.44 మీటర్లు ఎత్తుకు చేరుకున్నాయని తెలిపారు.

 

 

గేట్లను ఎట్టి పరిస్ధితుల్లో నవంబరులో బిగించాలని సీఎం ఆదేశించారు. ఈలోపు గేట్ల ఫాబ్రికేషన్‌ అయ్యేలా చూడాలని... ప్లాన్‌–బి పెట్టుకోవాలని నిర్దేశించారు. ప్రణాళికా బద్ధంగా పనులు సాగకపోతే షెడ్యూల్‌కు అంతరాయం ఏర్పడుతుందన్నారు. గత ఏడాది వరదలను దృష్టిలో ఉంచుకుని పోలవరం ముంపు బాధితులను తరలించడానికి చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

 

ముంపు ప్రమాదం ఉన్న వారికి సహాయ, పునరావాస కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్నారు. పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఖర్చు చేసిన 3791 కోట్లు కేంద్రం నుంచి రీయింబర్స్‌ పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరి జగన్ తాను విధించుకున్న టార్గెట్ అందుకోగలుగుతారా.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: