బొత్స సత్యనారాయణ....ఏపీ రాజకీయాల్లో కీలకమైన నేత. అప్పుడు వైఎస్ కేబినెట్‌లో, ఇప్పుడు జగన్ కేబినెట్‌లో బొత్స కీ రోల్ పోషిస్తున్న నాయకుడు. అసలు కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన బొత్స 1999 ఎన్నికల్లో బొబ్బిలి ఎంపీగా విజయం సాధించారు. నెక్స్ట్ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించి, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమారెడ్డి కేబినెట్లలో పనిచేశారు. ఏపీ పి‌సి‌సి అధ్యక్షుడుగా కూడా ఎఫెక్టివ్‌గానే పనిచేశారు.

 

అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్తితి ఎలా తయారైందో తెలిసిందే. అందరూ నేతలు కాంగ్రెస్‌ని వీడి టీడీపీ-వైసీపీల్లోకి వెళ్ళినా సరే బొత్స మాత్రం 2014 ఎన్నికల్లో అదే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి దాదాపు 42 వేల పైనే ఓట్లు తెచ్చుకుని టీడీపీ అభ్యర్ధి కిమిడి మృణాలిని చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ తర్వాత కాంగ్రెస్‌తో లాభం లేదనుకుని, వైసీపీలోకి వచ్చేసి, 2019 ఎన్నికల్లో మళ్ళీ చీపురుపల్లి నుంచి పోటీ సూపర్ విక్టరీ కొట్టి, జగన్ కేబినెట్‌లో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.

 

అయితే భవిష్యత్‌లో కూడా చీపురుపల్లిలో బొత్స తిరుగులేదని అర్ధమైపోతుంది. ఆయనకు చెక్ పెట్టడం చంద్రబాబుకు సాధ్యమైన పని కాదు. పైగా ప్రస్తుత టీడీపీ అభ్యర్ధి కిమిడి మృణాలిని తనయుడు నాగార్జున వీక్‌గా ఉన్నారు. గతంలో మృణాలిని మంత్రిగా చేసినప్పుడు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కున్నారు. దీంతో చంద్రబాబు...ఆమెని మధ్యలోనే పదవి నుంచి తొలగించారు. ఇక 2019 ఎన్నికల్లో బొత్స మీద ఆమె తనయుడు నాగార్జునని నిలబెట్టారు. కానీ బొత్స చేతిలో నాగార్జున చిత్తుగా ఓడిపోయాడు. భవిష్యత్‌లో కూడా నాగార్జున, బొత్సకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేడు.

 

దీంతో చీపురుపల్లిలో మంచి పేరున్న కొచ్చెర్లకోట త్రిమూర్తులరాజుని బొత్సపై పోటీకి దించితే ఫలితం ఏమన్నా ఉంటుందని చీపురుపల్లి తమ్ముళ్ళు భావిస్తున్నారు. మొన్న ఎన్నికల్లోనే సీటు కోసం కొచ్చెర్లకోట ప్రయత్నం చేయగా, బాబు బుజ్జగించి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సర్దిచెప్పారు. కానీ ఇప్పుడు నాగార్జున వీక్‌గా ఉండటంతో నెక్స్ట్ కొచ్చెర్లకోటనే బరిలో దించితే బొత్సకు చెక్ పెట్టొచ్చని, అలా కాకుండా నాగార్జునకే మళ్ళీ అవకాశం ఇస్తే చీపురుపల్లిలో టీడీపీ అడ్రెస్ ఉండదని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: