దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా విజృంభణ వల్ల సడలింపులతో అన్ లాక్ అమలవుతూ ఉండగా ప్యాసింజర్ రైళ్లను ఇప్పట్లో నడపలేమని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అయితే ఇదే సమయంలో ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. 
 
రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ మాట్లాడుతూ త్వరలో మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. కరోనా విజృంభణ వల్ల వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లారని.... వాళ్లు ఇప్పుడిప్పుడే నగరాల బాట పట్టడం సంతోషకరమని వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక రంగం కుదుటపడుతోందని చెప్పటానికి ఇదే నిదర్శనం అని పేర్కొన్నారు. రాష్ట్రాలు కోరితే మరిన్ని ప్రత్యేక రైళ్లను సమకూర్చటానికి తాము సిద్ధమేనని అన్నారు. 
 
వలస కార్మికుల కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో ఆక్యుపెన్సీని పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి నగరాలకు వెళ్లే కార్మికుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. జూన్ 25వ తేదీ వరకు 4,594 శ్రామిక్ రైల్ సర్వీసులను నడిపామని.... ఇప్పటివరకు 62.8 లక్షల మంది ప్రయాణికులకు రైళ్ల ద్వారా సొంతూళ్లకు చేర్చామని చెప్పారు. 
 
కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో భారత్ రైల్వే శాఖ రెగ్యులర్ రైళ్లను ఆగస్టు 12 వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. జులై 1 నుంచి ఆగస్టు 12 వరకు ఇప్పటికే టికెట్లు బుకింగ్ చేసుకున్న వాళ్లకు రిఫండ్ ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రైళ్ల రద్దు నేపథ్యంలో ఐ.ఆర్.సీ.టీ.సీ షేర్లు కుప్పకూలాయి. ఆగస్టు 12 తర్వాత పరిస్థితులకు అనుగుణంగా రైళ్లను నడిపే యోచనలో రైల్వే శాఖ ఉంది.                

మరింత సమాచారం తెలుసుకోండి: