మండలి రద్దు కానున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అంశం ఒక్కసారిగా తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కోటాలో మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు...రాజ్యసభకు ఎంపిక కావడంతో, జగన్ కేబినెట్‌లో రెండు బెర్త్‌లు ఖాళీ కానున్నాయి. అయితే ఈ రెండు బెర్త్‌లతో పాటు పనితీరు బాగోని మంత్రులని కూడా పక్కనబెట్టేసి...జగన్ కొత్తవారికి అవకాశం ఇవ్వొచ్చని ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.  

 

దీంతో ఖాళీ అయ్యే స్థానాలని దక్కించుకునేందుకు పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎవరి సామాజిక వర్గం ఖాళీలను అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులతో పదవులని భర్తీ చేయడం ద్వారా ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారని, అలాగే జిల్లాల సమతౌల్యాన్ని కూడా పాటించాలని యోచిస్తున్నారని సమాచారం.

 

సామాజికవర్గం విషయాన్ని పక్కనబెడితే, జిల్లాల పరంగా చూస్తే శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాలకు ఒక్కో మంత్రి పదవినే కేటాయించారు. అయితే శ్రీకాకుళం జిల్లాకు స్పీకర్, కడప జిల్లాకు ప్రభుత్వ చీఫ్ విప్ పదవులు కూడా ఉన్నాయి. కానీ 14 సీట్లు గల అనంతపురం జిల్లాకు ఒక్క మంత్రి పదవే ఉంది. పెనుగొండ నుంచి గెలిచిన శంకర్ నారాయణకు జగన్ కేబినెట్‌లో అవకాశం కల్పించారు. ఇక ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి రావడంతో జిల్లాకు ఇంకో మంత్రి పదవి వస్తుందేమో అని, సీనియర్ ఎమ్మెల్యేలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

ముఖ్యంగా జిల్లాలో ఉన్న 8 మంది రెడ్డి ఎమ్మెల్యేలు కేబినెట్‌లో చోటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో అత్యంత సీనియర్‌గా ఉన్న అనంత వెంకట్రామిరెడ్డితో పాటు, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిలు మంత్రి పదవులు ఆశించే వాళ్ళలో ఉన్నారు. అలాగే యువ సంచలనాలు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతిలు కూడా లక్కీగా తమకు ఛాన్స్ దక్కవచ్చేమో అని ఎదురుచూస్తున్నారు. మరి వీరిలో జగన్ మదిలో ఉన్నది ఎవరో?  

మరింత సమాచారం తెలుసుకోండి: