దేశంలో లాక్ డౌన్ సడలింపుల తర్వాత రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ విజృంభణ ప్రభావం ప్రధానంగా విద్యా రంగంపై పడింది. దీంతో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుని ఆ దిశగా చర్యలు చేపట్టాయి. పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహిద్దామన్నా అందుకు తగిన మౌలిక సదుపాయాలు లేవు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 40 శాతం కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్లు కూడా లేవు. 
 
కొంతమంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నా వాళ్లకు తగిన ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. మరోవైపు ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్న విద్యార్థులు టీచర్లు చెబుతున్న పాఠాలు తమకు అర్థం కావడం లేదని చెబుతున్నారు. ఆన్ లైన్ క్లాసుల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో తాజాగా బయటకు వచ్చిన సర్వే ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. 
 
రాష్ట్రంలో కేవలం 6.60 శాతం మంది తల్లిదండ్రులు మాత్రమే ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహించాలని చెబుతున్నారు. మిగిలిన వారంతా బడులను పునఃప్రారంభించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల యాజమాన్యాలు తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని.... విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. 
 
వైరస్ విజృంభిస్తూ ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలు ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కరోనా ప్రబలిన కారణంగా జాగ్రత్తలు తీసుకొని పాఠశాలలను ప్రారంభించాలని.... భౌతిక దూరం పాటించడం కోసం రెండు విడతలుగా స్కూళ్లను నడపాలని..... కరోనా కేసులు ఎక్కువ నమోదైన ప్రాంతాల్లో ఆన్ లైన్ బోధన మంచిదని.... ప్రభుత్వమే విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను అందించాలని సూచిస్తున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి నియంత్రణ సాధ్యమైతే మాత్రమే బడులు తెరుస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.       

మరింత సమాచారం తెలుసుకోండి: