పీఎం ఆవాస్‌ యోజన కింద నిర్మించిన ఇళ్లను వలస కార్మికులకు చౌక ధరలకే అద్దెకివ్వాలని నిర్ణయించింది కేంద్రం. ఈ అద్దె పథకం పాతికేళ్ల పాటు కొనసాగనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ స్పష్టం చేశారు.ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద దేశంలోని 107 పట్టణ ప్రాంతాల్లో నిర్మితమైన 1.08 లక్షల ఇళ్లను వలస కార్మికులకు చౌకగా అద్దెకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదముద్ర లభించింది. మునిసిపాలిటీలు ఈ ఇళ్లను స్వాధీనం చేసుకొని 25 ఏళ్లపాటు అద్దెకు ఇస్తాయని కేంద్ర సమాచార- ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావ‌డేకర్‌ విలేకరులకు వెల్లడించారు.

 

 

''ప్రభుత్వ నిధులతో నిర్మించి ప్రస్తుతం ఖాళీగా ఉన్న గృహ సముదాయాలను 25 ఏళ్ల కాలానికి గుత్తేదారులకు అప్పగిస్తారు. గుత్తేదారులు మౌలిక సదుపాయాలన్నీ కల్పించి వీటిని అద్దెకు ఇస్తారు. గడువు తీరాక వీటిని పట్టణ స్థానిక సంస్థలకు తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. వ్యక్తులు/ ప్రభుత్వరంగ సంస్థలు తమ సొంత స్థలాల్లో ఈ పథకం కింద ఇళ్లు నిర్మించడానికి ముందుకొస్తే ప్రత్యేక రాయితీలు కల్పిస్తారు. ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్రం రూ.600 కోట్ల గ్రాంటు ఇస్తుంది. ఆరుగురు కార్మికులు ఒకచోట నివాసం ఉండేలా డార్మిటరీలనూ నిర్మించనున్నారు. చిరుద్యోగులు, కార్మికులతోపాటు, విద్యార్థులకు తక్కువ అద్దెల్లో ఇళ్లు అందుబాటులోకి వస్తాయి.''

 

 

వ్యవసాయ రంగంలో మౌలిక వసతులు పెంచడానికి ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద ప్రకటించిన రూ.లక్ష కోట్ల రుణ పథకానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. దీనికింద నాలుగేళ్ల పాటు రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన’ను నవంబర్‌ వరకు పొడిగించారు. దీనికింద 81 కోట్లమందికి ప్రతినెలా 5 కేజీల ఆహారధాన్యాలు, కేజీ పప్పు దినుసులు ఉచితంగా లభిస్తాయి.ఉజ్వల పథకం కింద మహిళలు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు తీసుకునేందుకు విధించిన గడువును సెప్టెంబర్‌ వరకు పొడిగించారు.వందలోపు ఉద్యోగులున్న సంస్థల్లో రూ.15,000 కంటే తక్కువ జీతం తీసుకుంటున్న ఉద్యోగుల వాటాగా 12% పీఎఫ్‌ మొత్తాన్ని కేంద్రమే జమచేసే పథకాన్ని జూన్‌, జులై, ఆగస్టు నెలలకూ పొడిగించారు. దీనివల్ల 72 లక్షల మంది ఉద్యోగులకు రూ.4,860 కోట్ల మేర ప్రయోజనం కలగనున్నట్లు జావడేకర్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: