తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మార్చి 2న తొలి కరోనా కేసు నమోదు కాగా నిన్న నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 30,000 దాటింది. అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత వైరస్ వ్యాప్తి విసృతమైంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా 1800కు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 50 శాతం పైగా కేసులు గత పదిరోజుల్లోనే నమోదయ్యాయి. 
 
రాష్ట్రంలో గతంతో పోలిస్తే పరీక్షల సంఖ్య పెంచగా కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గత పదిరోజుల్లో ఆర్టీ పీసీఆర్ పద్ధతి ద్వారా 52,163 మందికి పరీక్షలు నిర్వహించగా 15,117 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో నిన్నటివరకు ప్రభుత్వం 1,40,755 నమూనాలను పరీక్షించింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 30,946కు చేరగా మృతుల సంఖ్య 331గా ఉంది. 
 
పరీక్షల సంఖ్య పెంచుతున్న కొద్దీ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న తీరు ప్రభుత్వాన్ని సైతం టెన్షన్ పెడుతోంది. . ఈ లెక్కన రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల శాతం 21.98గా ఉంది. దేశంలో జాతీయ సగటు పాజిటివ్‌ రేటు 7.1 శాతంగా ఉండగా తెలంగాణలో జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్ర సగటు మూడు రెట్లు అధికంగా ఉండటం ప్రజలను మరింత టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 75 శాతం పైగా కేసులు గ్రేటర్ పరిధిలో నమోదవుతున్నాయి. 
 
రాష్ట్రంలో నమోదైన కేసుల్లో రెండొంతుల కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదయ్యాయంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో సులభంగానే అర్థమవుతుంది. వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, నిజామాబాద్, కరీంగనర్‌, సంగారెడ్డి జిల్లాల్లో కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను నియంత్రించడం సాధ్యమయ్యే అవకాశాలు ఉండటంతో ప్రజలు వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: