త‌న మేన‌బావ‌, స‌హ‌చ‌ర క్యాబినెట్ మంత్రి హ‌రీశ్ రావుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ ప్ర‌శంస‌లు కురిపించారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్చార్డీలో మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ...మున్సిపాలిటీలను అన్నిరంగాల్లో అభివృద్ధిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్ర‌క‌టించారు. మున్సిపాలిటీల్లో ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని, త్వరలో నియామకాలు జరుగుతాయని వెల్లడించారు.

 

మున్సిపాలిటీలకు సిద్దిపేట ఆదర్శమని.. దానిని నమూనాగా తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు తయారుచేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. 42 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని మున్సిపాలిటీల అభివృద్ధికి నమూనా పట్టిక తయారుచేశామని చెప్పారు. ఆ అంశాల్లో మీ మున్సిపాలిటీలో ఏమి ఉన్నాయి? ఏమిలేవు? అన్నవి చెక్‌ చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ ఆలోచన విధానంలో భాగంగా మన టౌన్‌ అభివృద్ధిని మనమే ప్లాన్‌ చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేవని, మూడున్నరేళ్లు ప్రశాంతంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనుల్లో నిమగ్నం కావాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెల్ల రేష‌న్ కార్డు ఉన్నవారికి ఒక రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇవ్వాలని.. ఇతరులకు రూ.100కు ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రమంతా ఇదే విధానం అనుసరించాలని సూచించారు.

 


ఆగస్టు 15లోగా అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి వేయిమందికి ఒక పబ్లిక్‌ టాయిలెట్‌ ఉండే లక్ష్యంతో పనిచేయాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఇందులో మహిళల కోసం యాభై శాతం షీ టాయిలెట్లు ఉండాలని ఆదేశించారు. 400 పాత బస్సులను తీసుకొని మహిళల కోసం అన్ని పట్టణాల్లో షీ టాయిలెట్లుగా అందుబాటులో ఉంచుతామని మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఠంచన్‌గా నిధులు విడుదల చేస్తున్నదని చెప్పారు. శానిటరీ సిబ్బంది వివరాలను వార్డుల్లో ప్రదర్శించాలని, వారికి ప్రతినెలా మొదటి వారంలోనే రూ.12వేల వేతనం ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెమోలిష్‌ వేస్టేజ్‌తో టైల్స్‌ తయారు చేయవచ్చని, ఇలాంటి ప్రాజెక్టును ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మున్సిపాలిటీల్లో ఆదాయ వనరులను పెంచుకోవడంపై దృష్టి సారించాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: