దేశంలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి విద్యా రంగంపై, విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్ వ్యాప్తి వల్ల పాఠశాలలు తెరవకపోవడంతో పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు. నాలుగు గోడల మధ్య కుట్యుంబసభ్యులతోనే జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పిల్లల్లో మానసిక సమస్యలు ఏర్పడుతున్నాయి. కుంగుబాటుకు లోనుకావడం, అసహనానికి గురికావటం, సరిగా తిండి తినకపోవటంలాంటి ఇబ్బందులను పిల్లలు ఎదుర్కొంటున్నారు. 
 
చాలామంది పిల్లలకు చదువు పట్ల ఆసక్తి సన్నగిల్లుతూ ఉండటంతో పాటు మానసికంగా ఒంటరితనం ఎక్కువైంది. లాక్ డౌన్ సమయంలో తల్లిదండ్రులు ఇంటి దగ్గరే ఉండటంతో పిల్లలను కనిపెట్టుకుంటూ ఉండటం సాధ్యమయ్యేది. అయితే అన్ లాక్ 1.0, అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత తల్లితండ్రులు వృత్తివ్యాపారాల కోసం బయటకు వెళుతూ ఉండటంతో మానసికంగా ఒంటరితనం అనుభవిస్తున్న పిల్లల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 
 
తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుంటే మాత్రమే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మరోవైపు ప్రతిరోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు పిల్లల్లో భయాందోళనను పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లలను విసుక్కుంటే వాళ్లు మరింత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులు పిల్లలకు వాస్తవ పరిస్థితుల గురించి చెబుతూ వారిలోని మానసిక భయాలను తొలగించాలి. 
 
సాధారణంగా పిల్లల్లో చిన్నతనంలో చురుకుదనం పాళ్లు ఎక్కువగా ఉంటాయి. అయితే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ పిల్లలను చెడగొడుతున్నాయి. పిల్లలు స్మార్ట్ ఫోన్లను ఏ విధంగా వినియోగిస్తున్నారో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు రోజులో కొంత సమయమైనా పిల్లల కోసం కేటాయించాలి. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే పిల్లల్లో మానసిక సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. సైకాలజిస్టులు తల్లిదండ్రులు పిల్లల్లో ఉండే ప్రత్యేక నైపుణ్యాలను వెలికితీయాలని... పిల్లలను బహుముఖ ప్రజ్ఞాశాలులుగా తీర్చిదిద్దటానికి ఇదే సరైన సమయం అని చెబుతున్నారు. పిల్లలకు నీతి కథలు చెప్పటం, పద్యాలు పాడించటం లాంటివి అభ్యాసం చేయిస్తే మంచిదని సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: