కరోనాతో ప్రపంచం విలవిలలాడుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అన్ని దేశాలు వ్యాక్సిన్ల తయారు చేయడంతో నిమగ్నమయ్యాయి. ప్రపంచంలోనే తొలిసారిగా రష్యాలో కోవిడ్-19 వ్యాక్సిన్ పై అన్ని దశల్లో క్లినకల్ ట్రయల్స్ పూర్తి చేసుకోవడంతో కరోనాను తరిమి కొట్టగలమనే ఆశలు చిగురిస్తున్నాయి. రష్యాలో ఉన్న సెచెనోవ్ మెడికల్ యూనివర్సిటీలో కరోనాపై చేసిన వ్యాక్సిన్ ప్రయోగం అన్ని దశలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు ఇన్ స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ లేషన్ మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ డైరెక్టర్ వాదిమ్ తారాసోవ్ ఒక ప్రకటనలో తెలిపారు.

 


కరోనా వ్యాక్సిన్ కి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ను గమలి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయోలజీ జూన్ 18వ తేదీ నుంచి టెస్టులను ప్రారంభించింది. మొదటి క్లినికల్ ట్రయల్స్ చేసిన వాలంటీర్లను బుధవారం డిశ్చార్జి చేస్తున్నట్లు వెల్లడించింది. మిగిలిన వారిని జూలై 20వ తేదీన డిశ్చార్జి చేయనున్నట్లు తారాసోవ్ ప్రకటించారు. టీకాకు సంబంధించి భద్రత పరీక్షలు కూడా దిగ్విజయంగా పూర్తయినట్లు డైరెక్టర్ అలెగ్జాండర్ లుకాషేవ్ తెలిపారు.

 

టీకా భద్రత పరీక్షలు పూర్తికావడంతో ఇక వ్యాక్సిన్ ను డెవెలప్ చేయాలని సెచెనోవ్ యూనివర్సిటీ భావిస్తోంది. వీలైనంత తొందరగా వ్యాక్సిన్ ను మార్కెట్లో తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇదిలా ఉండగా.. గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) లండన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో తయారు చేస్తున్న వ్యాక్సిన్ ముందంజలో ఉందని, ఇది అత్యంత పురోగతి సాధిస్తుందని తెలిపింది.

 

ఈ వ్యాక్సిన్ కూడా ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు. రష్యా యూనివర్సిటీలో కూడా అన్ని దశల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోవడంతో అందరిలోనూ ఆశలు చిగురిస్తున్నాయి. పెరుగుతున్న కేసులు, మరణాలతో అన్ని దేశాలు రేయింబవళ్లు కష్టపడుతూ కరోనాపై యుద్ధం చేయగలమనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు. త్వరలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తప్ప ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేరన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: