హైదరాబాద్ లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గత నాలుగు రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం వైరస్ భారీన పడే అవకాశం ఉంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో వెలుగులోకి వస్తున్న కరోనా లెక్కలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో గంటకు 49 మంది వైరస్ భారీన పడుతున్నారు. గత 13 రోజుల్లో నమోదైన లెక్కల ప్రకారం సగటున రోజుకు 1169 మందికి కరోనా నిర్ధారణ అయింది. 
 
అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నెల మొదటివారంలో నమోదైన కేసులతో పోలిస్తే ప్రస్తుతం తక్కువగానే కేసులు నమోదవుతున్నా సగటున వైరస్ బారిన పడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నగరంలో ప్రతిరోజూ వెయ్యికి పైగా కేసులు నమోదు కాగా ప్రస్తుతం వెయ్యిలోపే కేసులు నమోదవుతున్నాయి. 
 
నగరంలో నిన్న ఒక్కరోజే 800 మంది వైరస్ నిర్ధారణ అయింది. శనివారంతో పోలిస్తే నిన్న 64 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. గత 13 రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ లో 14,033 మందికి వైరస్ నిర్ధారణ అయింది. మరోవైపు నగరంలో కరోనా సోకిన రోగులు సైతం రోడ్లపైకి వచ్చేస్తున్నారని తెలుస్తోంది. అధికారులకు గత కొన్ని రోజుల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 
 
కొందరు కరోనా సోకినా గృహ నిర్భంధంలో ఉండి చికిత్స తీసుకోవడం మానివేసి స్నేహితులను, ఇతరులను కలుస్తూ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. అధికారులు పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిని 14 రోజుల పాటు ఇళ్లల్లోనే ఉండేలా చూడాలన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అధికారులు కరోనా రోగులు బయటకు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: