ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1935 మంది కరోనా భారీన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ నుంచి కీలక ప్రకటన వెలువడింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 37 మంది మృతి చెందారు. ఏపీలో ఈ స్థాయిలో కరోనా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. 
 
అయితే రాష్ట్రంలో ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నా కొన్ని కీలక విషయాల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 27 వేల శాంపిళ్లు పరీక్షలు 
నిర్వహించడానికి పనికి రాకుండా పోయాయి. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పెద్దఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. నమూనాలు సేకరించేందుకు సిబ్బంది అహర్నిషలు శ్రమిస్తున్నారు. అయితే ప్రకాశం జిల్లా కలెక్టర్ చేసిన విచారణలో నిజం వెలుగులోకి వచ్చింది. 
 
27,000 శాంపిళ్లు ఐడీ నంబర్లు సరిగ్గా వేయకపోవడం, మూతలు సరిగ్గా పెట్టకపోవడం వల్ల వృథా అయ్యాయి. మరలా 27,000 మంది శాంపిళ్లను సేకరించడం అంత తేలికైన పని కాదు. అధికారులు నమూనాలు సేకరించే వాళ్లకు సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్లే జిల్లాలో ఇన్ని వేల శాంపిళ్లు వృథా అయ్యాయని తెలుస్తోంది. వైద్యాధికారుల, సిబ్బంది తప్పిదాలు జిల్లాలోని ప్రజల పాలిట శాపంగా మారాయి. 
 
కరోనా సోకిన వారి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందుతుండటం వల్లే  రాష్ట్రంలో రికార్డు  స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల మళ్లీ మొదటి నుండి పరీక్షలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో 27 వేల మంది కరోనా నివేదికలు రాకపోతే అప్పటివరకు రోడ్లపై సంచరిస్తారు. ఇలాంటి తప్పిదం పునరావృతం కాకుండా చర్యలు చేపట్టకపోతే మాత్రం భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: