అధికార వైఎస్సార్‌సీపీలో ఫైర్ బ్రాండ్ నాయకులకు ఎలాంటి కొదవ లేదనే చెప్పాలి. సమయాన్ని బట్టి స్పందిస్తూ, అధినేతకు అండగా నిలుస్తూ, ప్రత్యర్ధులకు చుక్కలు చూపించే నేతలు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అంటే వంటికాలి మీద వెళ్లిపోయేవాళ్లలో నగరి ఎమ్మెల్యే రోజా ముందు వరుసలో ఉంటారు. అసలు తెలుగుదేశంలో రాజకీయ జీవితం మొదలు పెట్టిన రోజా, 2004లో నగరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

 

అయితే 2009 ఎన్నికలోచ్చేసరికి చంద్రబాబు...రోజాని చంద్రగిరి పంపించారు. అక్కడ కాంగ్రెస్ తరుపున గల్లా అరుణ కుమారి ఉన్నారు. ఇక అప్పుడు కూడా రోజా టీడీపీ తరుపున బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఓడిపోతానని తెలిసే చంద్రబాబు తనని అక్కడకి పంపించారనే కసితో రోజా, కాంగ్రెస్‌కు దగ్గరవ్వాలని చూశారు. కానీ హఠాత్తుగా వైఎస్సార్ మరణం, జగన్ వైఎస్సార్‌సీపీ పెట్టడంతో అందులోకి వెళ్ళిపోయారు.

 

ఇక 2014 ఎన్నికల్లో రోజా వైఎస్సార్‌సీపీ తరుపున నగరిలో పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. అయితే అప్పుడు రాష్ట్రంలో టీడీపీలోకి వచ్చింది. అయినా సరే రోజా వైసీపీలో ఉంటూనే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా టీడీపీ ప్రభుత్వంపై పోరాటం చేశారు. అయితే ముద్దుకృష్ణమనాయుడు మరణించడంతో చంద్రబాబు 2019 ఎన్నికల్లో నగరి సీటు ఆయన తనయుడు గాలి భాను ప్రకాశ్‌కు ఇచ్చారు.

 

గాలి భాను ప్రకాశ్‌పై రోజా 2708 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్నాసరే రోజా స్వల్ప మెజారిటీతో గెలవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గాలి ఫ్యామిలీపై సానుభూతి ఉండటం వల్లే, రోజాకు స్వల్ప మెజారిటీ వచ్చింది.  అయితే రోజా ఈసారి ఆ అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు. నగరిలో రోజా దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రజల సమస్యలని పరిష్కరించడంలో ముందున్నారు. ఇదే సమయంలో గాలి భాను ప్రకాశ్‌కు సొంత కుటుంబంతోనే ఆధిపత్య పోరు ఉంది. దీంతో ఎన్నికలై ఏడాది దాటినా కూడా ఇక్కడ టీడీపీ పుంజుకోలేదు. భవిష్యత్‌లో కూడా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితిని బట్టి చూస్తే గాలి ఫ్యామిలీ నగరిలో రోజాకు హ్యాట్రిక్ కొట్టే ఇచ్చేసినట్లే కనబడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: