అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య కరోనా వైరస్ విజృంభణ వల్ల శత్రుత్వం ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే అనేకసార్లు డ్రాగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చైనా నిర్లక్ష్యం మూలంగానే ప్రస్తుతం అమెరికా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. భారత్ డ్రాగన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో దక్షిణ చైనా సముద్రంలో యుద్ధనౌకలను ఉంచి అగ్ర రాజ్యం మన దేశానికి మద్దతు ప్రకటించింది. 
 
ప్రస్తుతం అమెరికా భారత్ కు మిత్రదేశంగా వ్యవహరిస్తోంది. రష్యా మనకు మిత్రదేశమైనా అవసరాలను బట్టి ఆ దేశం వ్యవహరిస్తూ ఉంటుంది. ఇజ్రాయిల్ భారత్ కు కీలకమైన సందర్భాల్లో సహాయసహకారాలు అందించింది. ఏ దేశమైనా ఆ దేశపు అవసరాలను బట్టి నిర్ణయాలను మార్చుకుంటూ ఉంటుంది. అమెరికా ఒకప్పుడు భారత్ కు శత్రువు కాగా అవసరాలకు అనుగుణంగా మన దేశంతో స్నేహం చేస్తూ ప్రపంచ దేశాలకు నీతులు చెబుతోంది. 
 
నచ్చని దేశాల విషయంలో అగ్రరాజ్యం కఠినంగా వ్యవహరిస్తోంది. చైనా అధికారులకు సంబంధించిన వీసాలపై అమెరికా తాజాగా ఆంక్షలు కఠినతరం చేసింది. అత్యంత కీలకమైన పదవుల్లో ఉన్న మంత్రులు, చీఫ్ సెక్రటరీలకు మాత్రమే వీసాలు ఇస్తామని పేర్కొంది. అమెరికా తీసుకున్న నిర్ణయంతో మనస్తాపానికి గురైన చైనా ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. అమెరికా రాజకీయనాయకులకు, ఉన్నతాధికారులకు వీసాలు నిరాకరిస్తున్నట్లు పేర్కొంది. 
 
నలుగురు ఉన్నతాధికారులు చైనాకు వెళ్లటానికి వీసాల కోసం దరఖాస్తు చేసుకోగా డ్రాగన్ నిరాకరించింది. అమెరికా యాక్టివిటీ సరిగ్గా లేదని... అమెరికా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని అందువల్లే వీసాలను తిరస్కరిస్తున్నామని చైనా ప్రకటన చేసింది. ఆంక్షలు పెట్టి నీతులు చెబుతున్న చైనా ప్రపంచ దేశాల భూములను కబ్జా చేస్తూ విమర్శల పాలవుతోంది. చైనా అమెరికా ప్రస్తుతం శత్రువుల్లా కనిపిస్తున్నా భవిష్యత్తులో అవసరాల కోసం కలిసిపోయే అవకాశాలు ఉన్నాయని ఏ దేశమైనా అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలను మార్చుకుంటాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: