ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ లక్ష కోట్ల రూపాయల అప్పు కోసం ప్రయత్నిస్తోందని.... అమెరికాకు చెందిన ఒక ట్రస్ట్ ఈ అప్పు ఇవ్వడానికి సిద్ధమైందని.... ఈ ప్రక్రియకు సంబంధించిన అనుమతుల కోసమే నిర్మలా సీతారామన్ ను బుగ్గన రాజేంద్రనాథ్, అజయ్ కల్లం కలిశారని గత రెండు రోజులుగా ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వాస్తవంగా ట్రస్టులకు అప్పులు ఇచ్చే అధికారం ఉండదు. 
 
ట్రస్టులు ఇతర దేశాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పులు ఇవ్వవు. సాధారణంగా ట్రస్ట్ ప్రజల సంక్షేమం కోసమో, అభివృద్ధి కోసమో సేవాభావంతో పని చేసేది. ఇలా ఏర్పడిన సంస్థలు అప్పులు ఇవ్వడం ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మొదట జాతీయ మీడియాలో లక్ష కోట్ల అప్పుకు సంబంధించిన వార్తలు రాగా నిన్నటినుండి లోకల్ మీడియాలో సైతం ఈ తరహా ప్రచారం జరుగుతోంది. 
 
సాధారణంగా ప్రపంచ బ్యాంకులకు 3.5 నుంచి 4 శాతం చెల్లించాల్సి ఉండగా ఈ ట్రస్టుకు ఏపీ సర్కార్ 6 శాతం వడ్డీ చెల్లించనుందని కథనాలు ప్రచురితమయ్యాయి. ఏపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం 40 ఏళ్ల కాలపరిమితితో లక్ష కోట్ల రూపాయల రుణాన్ని చెల్లించాలని.... మరో రెండు అంశాలకు సంబంధించి జగన్ సర్కార్ అప్పులు తీసుకోనుందని వార్త సారాంశం. 
 
అయితే మొదట్లో ఈ వార్తలను ప్రచారం చేసిన మీడియా సంస్థలు అనంతరం తమ వెబ్ సైట్లలో, సోషల్ మీడియా ఖాతాలలో లక్ష కోట్ల రూపాయల అప్పుకు సంబంధించిన వార్తలను తొలగించాయి. జరుగుతున్న ప్రచారంపై వైసీపీ నేతల నుంచి ఇప్పటివరకైతే ఎలాంటి స్పందన వ్యక్తం కాలేదు. అయితే జగన్ సర్కార్ స్పందిస్తే మాత్రమే ఈ వార్త గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జగన్ సర్కార్ ఈ వార్త గురించి స్పందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: