పోలవరం.. సీమాంధ్రుల దశాబ్దాల కల. వందల ఏళ్ల క్రితం కాటన్ మహాశయుడికాలంలోనే ఊపిరిపోసుకున్న ఈ మహత్కార్యం ఇంకా సాకారం కాలేదు. కానీ ఇటీవల పోలవరం దిశగా కీలకమైన అడుగులు పడ్డాయి. కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. ముంపు మండలాలను తెలంగాణ నుంచి సీమాంధ్రలో కలిపేశారు. అందుకు చట్ట సవరణ కూడా దిగ్విజయంగా పూర్తయింది. ఇక అంతా సానుకూలమేనని అంతా అనుకుంటున్న సమయంలో.. అడ్డంకులు ఇంకా ఉన్నాయంటున్నారు పోలవరం సాధాన సమితి సభ్యులు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఉద్యమిస్తున్న రైతు సంఘాలు.. రాజమండ్రిలో రైతు సదస్సు నిర్వహించాయి. పోలవరం సాకారం కావాలంటే ఖమ్మం జిల్లాలోని మరో 4మండలాలను కూడా ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో దాదాపు 60వేల ఎకరాల భూములు ఉన్నాయని.. వీటిని కూడా ఏపీలో కలిపితేనే పోలవరం భూ సమస్యపూర్తవుతుందని చెబుతున్నారు. ఆ నాలుగు మండలాలను కలిపే వరకూ పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. చరిత్రలోని మరో కోణాన్ని పోలవరం సాధన సమితి సభ్యులు ఆవిష్కరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 1942లోనే పునాదులు పడ్డాయని వారు వివరించారు. శ్రీరామపాద సాగర్ పేరుతో అప్పట్లోనే 126 కోట్ల రూపాయల భారీ నిధులు అప్పటి వైశ్రాయ్ కేటాయించారని చెప్పారు. కానీ నిజాం నవాబు దీన్నిఅడ్డుకున్నారని వివరించారు. పోలవరం నిర్మాణం వేగవంతం అయ్యేలా పోరాటం ఉధృతం చేయాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. త్వరలో విజయవాడలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని డిసైడయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: