విశాఖపట్నం.. రాజధాని విషయంలో విజయవాడతో పోటీ పడలేకపోయినా.. ఉమ్మడి ఏపీ రాజధాని హైదరాబాద్ తో మాత్రం పోటీపడుతోంది. ఏ విషయంలో అనుకుంటున్నారా... గణేశ్ ఉత్సవాల విషయంలో. ఎందుకంటే ఇప్పటికీ గణేశ్ ఉత్సవాలు అంటే ముందుగా గుర్తొచ్చేది భాగ్యనగరమే. అందులోనూ ఖైరతాబాద్ గణపతికి ఉన్న క్రేజే వేరు. అంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఆయన ఎత్తే.. ఏటేటా ఎత్తుపెంచుకుంటూ వెళ్తోన్న ఖైరతాబాద్ గణపతిని చూసేందుకు భక్తులు బారులు తీరతారు. ఐతే గణేశ్ విగ్రహాల ఎత్తులో విశాఖ క్రమంగా హైదరాబాద్ రికార్డు చెరిపేస్తోంది. రెండు మూడేళ్లుగా ఖైరతాబాద్ గణపతి కంటే ఎక్కువ ఎత్తున విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి ఎత్తు 60 అడుగులు.. ఐతే.. విశాఖ గణపతి ఎత్తు 79 అడుగులు. ఇక గణేశ్ ఉత్సవాల్లో ఎక్కువగా చర్చనీయాంశమయ్యే అంశం. లడ్డూ.. గణేశ్ లడ్డూకూ ఎంతో క్రేజ్ ఉంటుంది. లడ్డూ పరిమాణంలో కూడా ఇటీవలి కాలం వరకూ ఖైరతాబాద్ గణేశ్ దే పైచేయి. కానీ ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి కంటే.. ఎక్కువ బరువున్న లడ్డూ రికార్డు కూడా విశాఖకే దక్కింది. ఈ సారి ఖైరతాబాద్ గణపతి లడ్డూ బరువు.. 5వేల కిలోలైతే.. విశాఖ గణపతి లడ్డూ బరువు 8వేల కిలోల పైమాటే. ఇది గిన్నిస్ రికార్డు కూడా. ఈ రెండు లడ్డూలు తయారు చేసింది మాత్రం తూర్పుగోదావరి జిల్లాలోని తాపేశ్వరం నుంచే కావడం విశేషం. ఇక మరో ఆసక్తికరమైన అంశం లడ్డూ వేలంపాట. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా పేరున్నది బాలాపూర్ లడ్డూకు. ఇక్కడ లడ్డూ వేలం పాట దాదాపు 900 రూపాయలతో ప్రారంభమై.. క్రమంగా లక్షల రూపాయలకు చేరింది. రియల్ ఎస్టేట్ బూమ్ ఉన్న సమయంలో బాలాపూర్ లడ్డూ కొత్త రికార్డులు సృష్టించింది. బాలాపూర్ లడ్డూ వేలంపాటకు మీడియా కూడా చాలా ప్రాధాన్యమిచ్చేది. ఈ ఏడాది కూడా బాలాపూర్ లడ్డూ తొమ్మిదిన్నర లక్షలు పలికింది. కానీ.. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక రికార్డ్టు మాత్రం విశాఖకే దక్కింది. విశాఖ మాధవధారలోని విజయగణపతి లడ్డూ వేలంపాట.. రూ.12.75 లక్షలు పలికింది. ఇలా గణపతి ఆకారం, గణపతి లడ్డూ పరిమాణం, గణేశ్ లడ్డూ వేలంపాట.. ఇలా అన్ని విషయాల్లోనూ విశాఖపట్నం హైదరాబాద్ రికార్డులను తిరగరాస్తోంది. ముందు ముందు కూడా ఇదే ఒరవడి కొనసాగితే.. విశాఖ కూడా హైదరాబాద్ తరహాలో ప్రసిద్ది చెందడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: