ఓటుకు నోటు స్కాం కథ క్లైమాక్స్ దిశగా అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లూ విచారణ దశలో ఉన్న ఈ కేసు ఇప్పుడు నోటీసులు, అరెస్టులతో వేడెక్కుతోంది. మొదటగా.. టీడీపీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు తెలంగాణ ఏసీబీ తాఖీదులు ఇచ్చింది. తమ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేయాలని ఎమ్మెల్యే సండ్ర స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు ఏసీబీ పూర్తి ఆధారాలు సంపాదించింది. మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులు హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని సండ్ర నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు.  

ఏసీబీ అధికారులు వెళ్లిన సమయంలో సండ్ర ఇంట్లో లేరు. అందుకే నోటీసులు ఆయన కుటుంబీకులకు ఇచ్చి.. రెండు రోజుల్లో విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి వెళ్లిపోయారట. ఇక టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన వేం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు తెలంగాణ ఏసీబీ అధికారులు ప్రయత్నించారు. మంగళవారం అర్ధరాత్రి ఆయన ఇంటికి వెళ్లారు. తాను గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నానని చెప్పిన వేంనరేందర్‌రెడ్డి.. బుధవారం ఉదయం విచారణకు హాజరువుతానని చెప్పారట. 

టార్గెట్ టీడీపీ లీడర్స్.. 


వేం నరేందర్ రెడ్డిని హౌస్ అరెస్ట్‌ చేస్తున్నట్టు ప్రకటించిన పోలీసులు.. బుధవారం ఉదయం విచారణకు రావాలని ఆదేశించారు. స్టీఫెన్‌సన్‌తోపాటు మరికొంతమందిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారా? కొనుగోలుకోసం డ్రాచేసిన నగదు ఎవరు పంపించారు? ఎవరి ఖాతాలనుంచి వచ్చింది? అనే కోణంలో వేం నరేందర్‌రెడ్డిని విచారించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.  

ఇక చంద్రబాబుతో పాటు, ఇతర టీడీపీ నేతలకు కూడా నోటీసులు జారీ చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలంగాణ ఏసీబీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరిని అరెస్టు చేసేందుకు నుమతులు కూడా పొందిందని ప్రచారం జరుగుతోంది. ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీ యజమాని, రాజ్యసభ ఎంపీని సైతం అరెస్ట్ చేసేందుకు అనుమతులుకూడా పొందారట. ఈ నేపథ్యంలో ఏ నిమిషంలో ఏంజరుగుతుందో అన్న దోళన టీడీపీ వర్గాల్లో కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: