టీడీపీ- పవన్ కల్యాణ్ మధ్య సంబంధాలు రోజు రోజుకూ క్షీణిస్తున్నాయి. ప్రత్యేకించి రాజధాని భూముల సేకరణ విషయంలో మొదలైన బేధాభిప్రాయాలు క్రమంగా పెరిగి పెద్దవవుతున్నాయి. తానేదో మంచి కోసం నాలుగు మాటలు చెబితే.. వెటకారం చేస్తున్నారంటూ మంత్రి యనమలపై పవన్ ట్వీట్ దాడి చేయడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఒక కౌంటర్ ట్వీట్ గానే కాకుండా ఇదో హెచ్చరికలా కనిపిస్తోంది. 

రాజధాని భూసేకరణపై ప్రభుత్వం ముందుకెళ్లాలని కృత నిశ్చయంతో ఉంది. కానీ.. పవన్ నదీతీరంలోని కొన్నిగ్రామాల పేర్లు చెప్పి వాటిని మినహాయించమంటున్నారు. రాజధాని మధ్యలో ఉంటే ఎలా విడిచిపెడతామని ఆంధ్రా సర్కారు పెద్దలు చెబుతున్నారు. ఊరికే చెప్పి వదలకుండా త్రిశంకు స్వర్గంలో కడతామా.. ఎలా కట్టాలో పవన్ చెబితే బావుంటుందంటూ సెటైర్లు వేయడంతో పవన్ దీన్ని సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తున్నారు. 

తాను త్వరలో నదీతీరంలోని కొన్ని రాజధాని గ్రామాల్లో పర్యటించబోతున్నానని చెప్పడం ద్వారా పవన్ కల్యాణ్ యుద్ధభేరి మోగించినట్టే చెప్పాలి. ప్రత్యేక హోదా.. విద్యార్థుల ఆత్మహత్యలు, బంద్ లు వంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న టీడీపీ ప్రభుత్వానికి ఇది మరో తలనొప్పి అయ్యే ప్రమాదం ఉంది. ఉన్న పాత శత్రువులకు తోడు.. మిత్రులను కూడా శత్రువులుగా మార్చుకోవడం ఇబ్బంది కలిగించకమానదు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో పవన్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయి. 

కొన్ని గ్రామాలను వదలి పెట్టాలంటూ ట్వీట్ పెట్టిన తర్వాత పవన్ కల్యాణ్ ఫోటోలకు కొన్ని గ్రామాల్లో క్షీరాభిషేకం చేసి... తమ ఆనందం చాటుకున్నారు. రేపు మిగిలిన గ్రామాల్లోనూ ఇదే సీన్ మొదలైతే.. చంద్రబాబు సర్కారు భూసేకరణ కోసం ఇబ్బందిపడాల్సి ఉంటుంది. అయితే పవన్ ఒక్క రాజధాని భూముల విషయంలోనే ఇంత పట్టుదలగా ఉంటారా.. మిగిలిన సమస్యలపైనా స్పందిస్తారా అన్నది ఇంకా తెలియదు. ఆయన ప్రత్యేక హోదా పై పోరులో కూడా ఇదే తరహా ప్రతిపక్షపాత్ర పోషిస్తే.. టీడీపీ సర్కారుకు తలనొప్పి పెరగక మానదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: