ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ఓ గొప్ప ముందడుగు పడింది. తాడేపల్లి గూడెంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. నిట్ ఏర్పాటైంది. దీని శంకుస్థాపన కోసం చంద్రబాబు, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి తాడేపల్లి గూడెం తరలివచ్చారు. అట్టహాసంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ, బీజేపీ నేతలు ఒకరినొకరు పొగుడుకున్నారు. స్మృతి ఇరానీని, వెంకయ్యను ఆకాశానికెత్తేశారు. 

ఇలా రొటీన్ గా సాగిపోతున్న సభలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఒక్కసారిగా కలకలం రేపారు. ఆయన తన ప్రసంగంలో చంద్రబాబు సర్కారు పనితీరును పొగుడుతూనే.. ఒక్క విషయంలో చంద్రబాబు తప్పు చేస్తున్నాడంటూ వెంకయ్య నేరుగా కామెంట్స్ చేసేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ఆదర్శపాఠశాలల్లో తెలుగు మీడియం విద్యాబోధనను ఎత్తి వేయాలని నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని తాడేపల్లిగూడెం వేదికగా వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. 

చంద్రబాబు ప్రభుత్వం తెలుగు మీడియం ను కొన్ని పాఠశాలల్లో ఎత్తేయాలని అనుకుంటోందని తనకు తెలిసిందనీ.. ఇది ఎంత మాత్రం మంచి పరిణామం కాదని వెంకయ్య విమర్శించారు. పిల్లలకు ప్రాధమిక విద్య మాతృభాషలోనే జరగాలని..అప్పుడు మన సంస్కృతీ సంప్రదాయాలు తెలుస్తాయని వెంకయ్య అన్నారు. మాతృభాషను మరచిన వాడు అసలు మనిషే కాదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వెంకయ్య ఘాటుగా మాట్లాడతారని తెలుసుగానీ..మరీ ఇంత పబ్లిగ్గా తమ అధినేతపై విరుచుకుపడతారని తెలుగు దేశం నాయకులు ఊహించలేకపోయారు. 

అప్పటివరకూ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ సాగిన వెంకయ్య ప్రసంగం ఒక్కసారిగా తన వైపు మరలేసరికి చంద్రబాబు కూడా కాస్త ఇబ్బందిపడ్డారు. ఓవైపు కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ వంటి వారిని పక్కన పెట్టుకుని.. వెంకయ్య.. మాతృభాషను మరచినవాడు మనిషేకాదని కామెంట్ చేస్తుంటే బలవంతపు నవ్వు పులుముకోవడం మినహా చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు. వెంకయ్య ప్రసంగంలో మాతృభాష ప్రస్తావన ముగిసే వరకూ ముళ్లపై కూర్చొన్నట్టే ఫీలయ్యారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఎప్పటిలాగానే కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడటంతో.. బతుకు జీవుడా అని చంద్రబాబు ఊపిరిపీల్చుకున్నారు. ఎంతైనా వెంకయ్య మాతృభాషాభిమానం మెచ్చుకోవాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: