టీడీపీ ఎమ్మెల్యేలు 23 మందా.. 4గురు మాత్రమేనా.. అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలయింది. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు అందరి మదిలోనూ ఇవే సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పొందాక ఆ పార్టీకి మిగిలింది 23 మంది ఎమ్మెల్యేలు. అందులో వాగ్దాటి, విషయ పరిజ్ఞానం ఉన్నవారు ఎక్కువ మందే ఉన్నారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబుకు అండగా ఉంటున్నది ఎంతమంది? 


అసెంబ్లీలో అధికార పార్టీ వైసీపీ బలం 151 మంది. టీడీపీకి 23 మంది. అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ నాయకులు టీడీపీని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. మాటకు ముందు.. మాటకు వెనుక “మీరు 23 మందే, అవినీతి చేశారు, ప్రజలు ఓడించారు, అందుకే అక్కడ కూర్చున్నారు” అంటూ టీడీపీ నేతలను, ముఖ్యంగా చంద్రబాబును దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే వైసీపీని ధీటుగా ఎదుర్కొంటోంది మాత్రం చంద్రబాబుతో సహా అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రమే. మరి మిగిలిన 19 మంది అసలు అసెంబ్లీకి ఎందుకొస్తున్నట్టు అనే ప్రశ్న అసెంబ్లీ సమావేశాలు చూసే వారికి వస్తున్నాయి. కరణం బలరాం, పయ్యావు కేశవ్, గంటా, వెలగపూడి.. ఇలా చాలా మంది వాగ్దాటి ఉన్నవారు, మాజీ మంత్రులు ఉన్నారు. కానీ ఎవరూ కూడా అధికార పక్షం చేస్తున్న విమర్శలను ధీటుగా ఎదుర్కోవడం లేదు.


బాలకృష్ణ అయితే సమావేశాలకు వస్తున్నదే తక్కువ. మిగిలిన వారు ఎందుకు మౌనంగా ఉంటున్నట్టో ఎవరికీ అర్ధం కావటంలేదు. గంటా, చినరాజప్ప.. వంటి వారు మంత్రులుగా కూడా చేశారు. కానీ ఎవరూ వైసీపీకి ఎదురువెళ్లటం లేదు. దీంతో ఈ నలుగురే టీడీపీ ఉనికిని, బాబుని కాపాడుతున్నారు. చూస్తుంటే.. వైసీపీతో తిట్టించుకుని సానుభూతి పొందాలని టీడీపీ ప్లానా.. లేక వైసీపీని ఎదుర్కొని ఇరుక్కోవడం ఎందుకనా.. లేక పార్టీ మారే ఉద్దేశాలేమైనా ఉన్నాయా.. అనే సందేహాలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: