ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఎన్‌ఎస్‌జీ భద్రత కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల దేశంలోని వీఐపీల భద్రతపై కేంద్ర హోంశాఖ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్ష అనంతరం యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, మీరా కుమార్‌ తదితరుల భద్రతను తగ్గించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మావోయిస్టుల ఏరివేతతో పాటు ఉగ్రవాదుల కుట్రలను భగ్నం చేసే చర్యలను చేపట్టడంతో వారు ఆయనపై పగబట్టారు. 

అప్పట్లో 2003లో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళుతుండగా అలిపిరి వద్ద పీపుల్స్‌వార్ గ్రూప్‌కు చెందిన నక్సలైట్లు శక్తివంతమైన ల్యాండ్‌మైన్లు పేల్చారు. ఈ దాడిలో బాబు తృటిలో ప్రాణాలతో బయటపడ్డ విషయం తెలిసిందే.  అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు నక్సల్స్ కి టార్గెట్ గా మారారని ఆయనకు ఎంతో భద్రత పెంచారు. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు నారా లోకేశ్‌కు భ్రదతను కుదించారు.

దీనిపై చంద్రబాబు హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆయనకు ఎన్ఎస్‌జీ భద్రతను కొనసాగించడం గమనార్హం.  మరోవైపు చంద్రబాబుకు జడ్‌ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగిస్తున్న మోడీ ప్రభుత్వం కొంత మంది మాజీ ముఖ్యమంత్రుల విషయంలో మాత్రం ఆ నిర్ణయం తీసుకోలేదు.  కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ కమాండోలతో భద్రతను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: