ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల పంట పండుతోంది.. వరుసగా ఒకదాని వెంట మరొకటి నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇటీవలే దాదాపు లక్షన్నర వరకూ గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత గ్రామ సచివాలయ పోస్టుల నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇక త్వరలో మరో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


ఎందుకంటే.. పాఠశాలల్లో ఖాళీల భర్తీకి క్యాలెండర్ తయారు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. విద్యార్ధుల సంఖ్యకు తగినట్టుగానే ఉపాధ్యాయల సంఖ్య ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపర్చే విషయంలో అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.


తొలివిడతలో 12,918 ప్రాథమిక పాఠశాలలు, 3,832 ప్రాథమికోన్నత పాఠశాలల రూపురేఖలు మార్చాలని సీఎం ఆదేశించారు. ఆహ్లాదకరంగా ఉండేలా పెయింటింగులతో పాఠశాలలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు.


మరి విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు ఉపాధ్యాయులు ఉండాలంటే మళ్లీ ఉపాధ్యాయుల నియామకాలు జరగాలి. మరి ఈ నియామకం ఎలా ఉంటుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విద్యావాలంటీర్లను భారీగా నియమిస్తారా లేక.. కొత్తగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది.


ఏదేమైనా పాఠశాలల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టు స్పష్టమవుతోంది. విద్యావ్యవస్థను గాడిలో పెట్టడం ద్వారా ప్రజల మనసు గెలుచుకోవాలన్నది ఆయన లక్ష్యంగా ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులు బాగా ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో పిల్లల చదువు ఒకటి. ఫీజులు భారం అధికమైన ఈ నేపథ్యంలో నాణ్యమైన సర్కారీ విద్య అందిస్తే వారికి అంతకు మించి కావాల్సిందేముంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: