తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అనంతరం అధికార టీఆర్ఎస్ లో అసంతృప్తి గళాలు వినిపిస్తున్న వారిని కట్టడి చేసేందుకు ఆ పార్టీ  కార్యనిర్వాహక అధ్యక్షుడు,  మున్సిపల్, ఐటీ శాఖల  మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు.  పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన వారిని కార్యకర్తలు ప్రశ్నించాలన్న ఆయన,  తాను మాట్లాడినా కూడా ఎక్కడైనా నిలదీయ్యవచ్చునని  పేర్కొన్నారు .  ఇక ఇటీవల పార్టీ సీనియర్ నాయకుడు,  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మాజీ  హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి లు  పార్టీకి తామే ఓనర్ల మంటూ చేసిన వ్యాఖ్యలకు కూడా కేటీఆర్  పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.


 ఆస్తులకు ఓనర్లు ఉంటారు ... తప్పితే అస్తిత్వాలకు  కాదన్న ఆయన,  తెలంగాణ ప్రజల అస్తిత్వానికి టిఆర్ఎస్ పార్టీ ప్రతీక  అని పేర్కొన్నారు.  కేబినెట్ విస్తరణ అనంతరం పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి గళాలు వినిపించడం ... అజ్ఞాతం లోకి వెళ్లడం చేసిన విషయం తెలిసింది.  ఈ నేపథ్యంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు  చేసిన వ్యాఖ్యలు పార్టీలో గందరగోళానికి దారితీశాయి. దీనితో ఇకపై ఎవరు కూడా మీడియాతో చిట్, చాట్ చేయవద్దని  పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలకు,  పార్టీ ముఖ్య నాయకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.   అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు  లాబీల్లో విలేకర్లతో చిట్,  చాట్  చేసిన విషయాలను కొన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించడం టిఆర్ఎస్ నాయకత్వానికి తలనొప్పిగా మారింది.


 అయితే  తాము అన్నది  ఒకటైతే వారు రాసింది మరొకటి అంటూ పార్టీ ఎమ్మెల్యేలు తమని తాము సమర్ధించుకునే ప్రయత్నం చేసినప్పటికీ,  ప్రజల్లో మాత్రం టీఆరెస్ పార్టీ లో ఏదో జరుగుతోంది అన్న అనుమానాలు రేకెత్తించే విధంగా సంకేతాలు వెళ్లాయి . భవిష్యత్తు లో ఈ తరహా సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు   పార్టీ ఎమ్మెల్యేలు , ముఖ్య నేతలను మీడియా కు దూరంగా ఉంచాలని టీఆరెస్ నాయకత్వం భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: