వ్యూహా ప్రతివ్యూహాలు నడుమ రసవత్తరంగా సాగిన  హుజూర్ నగర్ ఎన్నికల ప్రచార పర్వం  శనివారం సాయంత్రానికి ముగియనున్నది. ఎన్నికల నియమావళి ప్రకారం అభ్యర్థులు తమ తమ ప్రచార ఘట్టానికి బ్రేకులు వేయక తప్పదు. ప్రచారానిక ఇవాల్టితో తెరపడనుంది. హుజూర్ నగర్ ఉపఎన్నిక సమయంలోనే తెలంగాణ ఆర్టీసీ సమ్మె రావడంతో ఆ ప్రభావం ఓటర్లపై ఏ స్థాయిలో ఉంటుందన్నది కూడా ఆసక్తిగా మారింది. గెలుపోటములపై ఆయా పార్టీలు తర్జన భర్జన పడుతున్నారు. తమ పార్టీ అభ్యర్ధి గెలిస్తే హుజూర్ నగర్ కు మేలు జరుగుుతుందని కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కుటుంబానికే మేలు జరుగుతుందని గులాబీ పార్టీ ప్రచారం చేసింది.



మూడు సార్లుగా హుజూర్ నగర్ లో హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన ఉత్తమ్ ఇంతకాలం తన చేసిన అభివృద్ధే కాంగ్రెస్ ను గెలిపిస్తోందని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా వెళ్లడంతో హుజూర్ నగర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూర్ నగర్ లో గెలుపును అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హుజూర్ నగర్ లో ఎలాగైనా ఈసారి గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంటే కంచు కోట స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యే కనిపిస్తోంది.



నెలరోజుల క్రితం ఎన్నికల షెడ్యూల్  విడుదలైనప్పటి నుంచి హుజూర్ నగర్ లో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ పద్మావతి, టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. టీడీపీ , బీజేపీ కూడా ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. బీజేపీ అభ్యర్దిగా డాక్టర్ కోట రామారావు, టీడీపీ నుంచి చావా కిరణ్మయి పోటీ చేస్తున్నారు. మొత్తం రెండు లక్షల 36 వేల మంది ఓటర్లు ఎల్లుండి జరిగే ఉప ఎన్నికల పోలింగ్ లో విజేతను నిర్ణయిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: