పూసపాటి అశోక్ గజపతి రాజు.....రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. విజయనగరం జిల్లా పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చేది పూసపాటి వంశమే.  ఆ వంశం నుంచి వచ్చిన అశోక్ గజపతి రాజు నిజాయితీ గల రాజకీయాలు చేస్తూ దాదాపు నాలుగు దశాబ్దాలుగా విజయనగరం ప్రజలకు సేవలు చేస్తున్నారు. 1978లో జనతా పార్టీలో రాజకీయ అరంగ్రేటం చేసిన అశోక్...విజయనగరం నుంచి  తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.


ఆ తర్వాత ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చి 1983 నుంచి అప్రతిహతంగా 1999 వరకు టీడీపీ తరుపున విజయనగరం అసెంబ్లీ నుంచి విజయ బావుటా ఎగురవేశారు. ఇక ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి బదలాయింపు కావడం వెనక కూడా అశోక్ గజపతిరాజు పాత్ర చాలానే ఉంది. బాబు హయాంలో రెనిన్యూ ఆర్ధిక శాఖలు నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. అయితే అప్పటివరకు తిరుగులేని విజయాలు సాధించిన అశోక్ కు 2004 లో బ్రేక్ పడింది.


అప్పటి స్వాతంత్య్ర‌ అభ్యర్ధిగా పోటీ చేసిన కొలగట్ల వీరభద్రస్వామి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక 2009 లో మళ్ళీ గెలిచిన అశోక్...2014 ఎన్నికల్లో చంద్రబాబు ఆదేశాలతో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక కేంద్రంలో బీజేపీతో పొత్తు ఉండటంతో అశోక్ కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. పౌర విమానయాన శాఖ మంత్రిగా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే బీజేపీతో పొత్తు తెగదెంపులు అవ్వడంతో అశోక్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే మొన్న ఎన్నికల్లో మళ్ళీ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.


ఓడిపోయిన దగ్గర నుంచి అశోక్ పార్టీలో అస్సలు కనబడటం లేదు. పైగా విజయనగరం జిల్లా మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో పాటు పార్టీలో కూడా ఆయనకు ప్రాధాన్యత కూడా తగ్గుతుండటంతో చంద్రబాబుకు దూరం జరగడం మొదలుపెట్టారు. పైగా అనారోగ్యం కూడా తొడవ్వడంతో అశోక్ పూర్తిగా రాజకీయంగా అస్త్ర సన్యాసం చేసేసినట్లే కనిపిస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో అయిన అశోక్ గజపతి రాజు పార్టీలో మళ్ళీ కనిపిస్తారేమో...  


మరింత సమాచారం తెలుసుకోండి: