ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల ఇంటి దగ్గరకు చేర్చటం కొరకు గ్రామ, వార్డ్ వాలంటీర్లను నియమించింది. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున గ్రామ, వార్డ్ వాలంటీర్లు ఆగస్టు నెల 15వ తేదీన విధుల్లో చేరారు. గ్రామ వాలంటీర్ గా విధుల్లో చేరిన ప్రకాశం జిల్లా కోరిశపాడుకు చెందిన నూతలపాటి వెంకటకృష్ణ శనివారం అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 
 
వెంకటకృష్ణ ఆత్మహత్య చేసుకోవటానికి అప్పుల బాధలే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఏడాది క్రితం వెంకటకృష్ణ తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. వెంకటకృష్ణ తండ్రి అనారోగ్యానికి గురైన సమయంలో తండ్రి వైద్యం కొరకు తెలిసిన వారి దగ్గర అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చకపోవటంతో అప్పులు ఇచ్చిన వారి దగ్గర నుండి ఒత్తిడి పెరిగింది. అప్పుల బాధతో వెంకటకృష్ణ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. 
 
ఎస్సై బాలకృష్ణ కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లాలోనే జుబేదా అనే 22 సంవత్సరాల గ్రామ వాలంటీర్ ఆత్మహత్య చేసుకుంది. శివ అనే కంప్యూటర్ ఆపరేటర్ సరిగ్గా పని చేయటం లేదని దూషించాడని మనస్తాపం చెంది జుబేదా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. నెలరోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లాలోని పండువారిగూడెంలో పండు నవీన అనే గ్రామ వాలంటీర్ ఆత్మహత్య చేసుకుంది. 
 
పండువారిగూడెంకు చెందిన ఒక మహిళ నవీనను ఆధార్ లో తప్పులున్నాయని సరి చేయాలని కోరగా నవీన ఆధార్ లో మార్పులు తన పరిధిలోకి రావని చెప్పింది. మహిళ మాత్రం నవీన ను ఇష్టం వచ్చినట్లుగా దూషించటంతో మనస్తాపం చెందిన నవీన ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో చిన్న చిన్న విషయాలకు ఆత్మస్థైర్యం కోల్పోకుండా గ్రామ వాలంటీర్లు మానసికంగా ధృఢంగా ఉండటానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: