తిరుమల.. తెలుగువారికి.. ఆ మాట కొస్తే దక్షిణ భారతీయులకు తిరుమల శ్రీనివాసులు ప్రత్యక్షదైవం.. ఉత్తర భారతీయులు కూడా పెద్ద సంఖ్యలోనే తిరుమలకు వస్తుంటారు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఉన్న దేవుడిగా శ్రీనివాసుడికి పేరు. అలాంటి పవిత్ర తిరుమలలో ఓ అరాచకం జరుగుతోందని మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు వెళ్లింది. 

అణగారిన కులాల వారిచేత ఉన్నత వర్గాలకు  చెందిన  వారిని మోయించడం బానిసత్వ పోకడలకు  నిదర్శనమంటూ సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాలేంటంటే.. శ్రీవారికి నిత్యం అనేక పూజలు, సేవలు జరుగుతుంటాయి. తిరుమల నిత్యకళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా ఉంటుంది. ఇక బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో శ్రీనివాసుని వైభవం మాటల్లో వర్ణించలేం. అలాంటి సేవల్లో శ్రీవారి పల్లకీ సేవ ఒకటి. తిరుమల మాడ వీధుల్లో శ్రీనివాసుడు వివిధ అలంకారాల్లో పల్లకీలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. 

అలాంటి పల్లకీ సేవ వేళ పల్లకీలో స్వామివారితో పాటు కొందరు అర్చకులు కూడా కూర్చుంటారు. ఈ పల్లకీని కొందరు వస్తాదులు మోస్తుంటారు. ఇప్పుడు ఇదే వివాదంగా మారింది. మనిషిని ఓ మనిషే మోయడం బానిసత్వమని.. బానిసత్వం, వెట్టిచాకిరి వంటి అరాచకాలు రద్దయిన తర్వాక కూడా ఇంకా ఇది తిరుమలలో స్వామి వారి పేరుతో కొనసాగడం మానవ హక్కుల ఉల్లంఘనేనని వాదిస్తున్నారు కర్ణాకటకు చెందిన నరసింహామూర్తి.

స్వామివారిని ఊరేగించడంలో తప్పులేదని.. కానీ స్వామివారితో పాటు అర్చకులు కూడా కూర్చోవడం తప్పని ఆయన అంటున్నారు. అంతర్జాతీయ, భారతీయ చట్టాల ప్రకారం కూడా మనుషులతో మనుషులను మోయించడం నేరమని ఆయన లా పాయింటు చెబుతున్నారు. దీనిపై ఆయన హెచ్చార్సీకి, తిరుమల తిరుపతి దేవస్థానముల ఛైర్మన్ కు, తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: