నిత్యం ప్రజలకు వార్తలందించే మీడియా హౌసులు కూడా ఇప్పుడు ఆసక్తికరమైన వార్తలకు నిలయాలవుతున్నాయి. తమ సంస్థలో పట్టు కోసం మీడియాలోని పెద్ద తలకాయలు వేసే ఎత్తులు - జిత్తులు.. రాజకీయాలకు ఏ మాత్రం తీసిపోవు. ఏమీడియాలోనైనా 2, 3 ఏళ్లకోసారి మార్పులు తప్పవు. ఇప్పుడు జగన్ సొంత మీడియా సాక్షిలోనూ అదే జరుగుతోంది.  


సాక్షి మీడియాలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లూ కీలకపదవుల్లో ఉన్నవారిని కొన్ని అప్రాధాన్య విభాగాలకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సాక్షిలో పెద్ద తలకాయగా వ్యవహరిస్తున్న సీనియర్ ఎడిటర్ రామచంద్రమూర్తి ఇప్పుడు సంస్థపై పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. తాజా మార్పుల్లో ఆయన అనుచరులకే పెద్ద పీట వేశారట. 

 

తాజా మార్పులపై చాలామంది సీనియర్లు అసహనంతో ఉన్నారట. కాకపోతే.. ఈ మార్పులకు భారతి ఆమోద ముద్ర ఉండటంతో ఏమీ అనలేకపోతున్నారట. ఇలాంటి అసంతృప్తిపరులు జాబితా పెద్దగానే ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తులుగా పేరున్న వారు కీలక స్థానాల్లో ఉండేవారు. తాజా మార్పుల కారణంగా.. వారికి చుక్కెదురయ్యిందట. 


ఈ మార్పుల కారణంగా చాలా మంది ప్రతిభ ఉన్నవారిని కూడా పక్కకుపెట్టడం అంతమంచిది కాదంటున్నారు.. ఈ మార్పులను దగ్గర నుంచి చూసిన కొందరు సీనియర్లు. అంతర్గతంగా ఎన్ని రాజకీయాలు ఉన్నా.. సంస్థ ప్రయోజనమే వాటి లక్ష్యం అయితే అందరికీ మంచిదంటున్నారు. మరి ఈ మార్పులు సాక్షిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కొన్నాళ్లు ఆగితే కానీ తెలియదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: