కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ .. ఆంధ్రాపై వరాల వర్షం కురిపించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 65 వేల కోట్ల రూపాయల విలువైన రోడ్డు ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపేశారు. అడిగినవీ.. అడగనివీ అన్నీ ఇచ్చేశారన్న ఫీలింగ్ కలిగింపజేశారు. ఆంధ్రుల రాజధాని నగరం ఇంకా ఓ రూపు దాల్చక ముందే.. అమరావతి చుట్టూ 180 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును నితిన్ గడ్కరీ కానుకగా ఇచ్చారు. ఈ ఒక్క ప్రాజెక్టుకే 20 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయట. 

విజయవాడలో దుర్గగుడి, బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ల, మూడు జాతీయ రహదారుల నిర్మాణ పనులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 1350 కిలోమీటర్ల మేర నేషనల్ హైవేల నిర్మాణం కోసం కూడా గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీని కోసం 13 వేల 500 కోట్ల నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందట. ఇప్పటికే కేటాయించిన ప్రాజెక్టుల నిధులు 15 వేల కోట్లు.. కొత్తగా ప్రకటించినవి 50 వేల కోట్లు.. మొత్తం 65 వేల కోట్లన్నమాట. 

అంతేకాదు.. రోడ్డు రవాణా కంటే జల రవాణా చాలా చీప్ అన్న గడ్కరీ ఏపీలోని జల రవాణా మార్గాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. కృష్ణా, గోదావరి, బకింగ్ హాం కెనాల్ పై జల రవాణాకు గల అవకాశాలపై సర్వే చేయిస్తున్నట్టు గడ్కరీ వివరించారు. కేంద్రంతో ఉన్న సత్సంబంధాలతో మొత్తం మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి ప్రాజెక్టులే శాంక్షన్ చేయించుకున్నారు. ఓ పథకం ప్రకారం అభివృద్ధిపై దృష్టి సారించారు. 

ఏపీకి నితిన్ గడ్కరీ ఇచ్చిన ప్రాజెక్టుల వివరాలు చూసి.. వేదికపైనున్న నాయకులు కూడా ఆశ్చర్యపోయారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఫుల్ ఖుషీ అయిపోయారు. గడ్కరీ మాట్లాడిన తర్వాత మైక్ అందుకున్న చంద్రబాబు ఇంకా ఏమీ అడిగే పని లేకుండానే అన్నీ ఇచ్చేశారని సభాముఖంగానే ప్రకటించేశారు. అంతా బాగానే ఉంది. కానీ ఓ చిన్న చిక్కు కూడా ఉంది. అన్ని ప్రాజెక్టులకూ ఏపీ సర్కారు డీపీఆర్ ఇవ్వాలి. వాటిని కేంద్రం పరిశీలించి నిధులు ఇస్తుంది. ఈ ప్రక్రియలో జాప్యం జరగకుండా నిత్యం ఫాలో చేసుకుంటే ఏపీ అభివృద్ధిని ఆపేవారెవరుంటారు ?


మరింత సమాచారం తెలుసుకోండి: