నాయకుడిగా చంద్రబాబుకు కొన్ని ప్లస్ పాయింట్లతో పాటు కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఆయన ఎన్టీఆర్ లా వాగ్దాటి ఉన్న నాయకుడు కాదు. ఆకట్టుకునే రూపం ఉన్న వ్యక్తి కూడా కాదు.. కానీ మైక్ పట్టుకుంటే మాత్రం ఓ పట్టాన వదిలిపెట్టే వాడు కాదు. అది ఓ గ్రామంలో జరిగే చిన్న అభివృద్ధి కార్యక్రమం కానీ.. అసెంబ్లీలో ప్రసంగం కానీ పెద్దగా తేడా ఉండదు. 


బాబు మైకు పట్టుకున్నారటే.. కనీసం ఓ గంట సేపు వాయించేస్తారని ఆ కార్యక్రమానికి వచ్చిన విలేకరులు ముందుగానే డిసైడ్ అవుతారు. అందులోనూ ఆ ప్రసంగం కూడా ఏం చెబుతారో ముందే ఊహించేలా ఉంటుంది. ఇటీవలి కాలంలో ఆయన ప్రసంగాలను పరిశీలిస్తే.. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారన్న పాయింట్ తో ప్రారంభించి.. రొడ్డకొట్టుడు ఉపన్యాసం మొదలుపెడతారు. 


అలాంటిది..  విజయవాడ చరిత్రలో సుదినమైన ఈ రోజు ఆయన చాలా సింపుల్ గా ప్రసంగాన్ని తేల్చేశారు. నిజంగానే ఇవాళ బెజవాడ చరిత్రలో ఓ హిస్టారికల్ డే. బెజవాడ ట్రాఫిక్ కు పరిష్కారం చూపే రెండు ఫ్లై ఓవర్లు ఒకే రోజు శంకు స్థాపన జరుపుకోవడం... మరికొన్ని జాతీయ రహదారులకూ గ్రీన్ సిగ్నల్ రావడం నిజంగా చెప్పుకోదగిన ఘటనే. ఈ శుభ సందర్భంలో జరిగిన ఓ సభలో చంద్రబాబు కేంద్ర మంత్రులు వెంకయ్, గడ్కరీలతో పాటు సొంత పార్టీ నేతలకు కూడా షాక్ ఇచ్చారు. 


నితిన్ గడ్కరీ అన్ని వరాలు ప్రకటించిన తర్వాత ప్రసంగించిన చంద్రబాబు కేవలం అరగంట సేపట్లోనే తన ప్రసంగాన్ని ముగించేశారు. అమరావతి పరిధిలో జరిగిన సభలో.. అందులోనూ కేంద్రమంత్రులు కొలువుదీరిన సభలో.. చంద్రబాబు ఇలా క్లుప్తంగా ప్రసంగించడం విశేషమే. మరి అప్పటికే వెంకయ్య, గడ్కరీ వంటి నేతలు ఫుల్లుగా వాయించేశారని బాబు సభికులపై జాలి చూపారో.. అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదో.. అర్థంకాక విలేఖర్లు అవాక్కయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: