రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య సత్సంబంధాలు లేవన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ పై నేరుగా విమర్శలు చేసే వాళ్లలో తెలంగాణలో రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. రాజకీయ విమర్శలే కాకుండా వ్యక్తిగతంగానూ రేవంత్ విమర్శిస్తారు. బట్టలిప్పి కొట్టిస్తా...  కేసీఆర్ ను టీడీపీ కార్యకర్తలు తరమేస్తారు.. ఈ స్థాయిలో కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేస్తుంటారు రేవంత్ రెడ్డి. 

అయితే రేవంత్, కేసీఆర్ లది కేవలం రాజకీయ శత్రుత్వమే కాదట. అది వ్యక్తిగతంగానూ మారిందట. ఈ మాట స్వయంగా రేవంత్ రెడ్డే వెల్లడించారు. రాజకీయ పోరాటంగా ఉన్న బంధాన్ని కేసీఆర్ వ్యక్తిగత పోరుగా మార్చారని రేవంత్ అన్నారట. తన కుటుంబంపై పగ తీర్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నించారని ఆయన ఆరోపించారట. అందుకే కేసీఆర్ తో ఉన్న వైరాన్ని తాను వ్యక్తిగతంగా కూడా ఫీలవుతానని రేవంత్ అంటున్నారు. 

అసలు ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటున్నారా.. ఆ రేవంత్ రెడ్డి కుమార్తె వివాహం ఈనెల 20 న జరగాల్సి ఉంది. గతంలో ఎంగేజ్ మెంట్ సమయంలో రేవంత్ రెడ్డి జైలు నుంచి పర్మిషన్ తీసుకుని మరీ వచ్చిన సంగతి తెలిసిందే. తనను అంతగా ఇబ్బంది పెట్టిన కేసీఆర్ ను పెళ్లికి పిలిచేది లేదంటున్నారు రేవంత్ రెడ్డి. ఎంతటి రాజకీయ శత్రుత్వం ఉన్నా.. పెళ్లిళ్లు పేరంటాలకు పిలుచుకోవడం సాధారణంగా జరిగేదే.

అందులోనూ కేసీఆర్ తెలంగాణ సీఎం గా ఉన్నారు. అలాంటప్పుడు కేసీఆర్ ను కూడా పెళ్లి పిలుస్తారనే అంతా అనుకుంటారు. కానీ రేవంత్ మాత్రం ససేమిరా అంటున్నారు. ముఖ్యమంత్రిని  ఆహ్వానించబోనని.. కానీ మంత్రులు, ఇతర టీఆర్ ఎస్ నేతలను పిలుస్తానని అంటున్నారు. అదేమని అడిగితే.. తమిళనాడులో జయలలిత, కరుణానిధి ఇంట్లో కార్యక్రమాలు చేస్తే ఆహ్వానించుకుంటారా అంటూ విలేకరికి కౌంటర్ ప్రశ్న వేశారు రేవంత్. 


మరింత సమాచారం తెలుసుకోండి: