రాజకీయాల విషయం సంగతి ఎలా ఉన్నా.. చంద్రబాబుకు మంచి పాలనాదక్షుడిగా పేరుంది. ఇప్పుడు ఆయనకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రికీ దక్కని ఛాలెంజింగ్ ఛాన్స్ దక్కింది. ఓ రాష్ట్రానికి రాజధాని నిర్మించే అవకాశం రావడం..అందులోనూ గ్రౌండ్ లెవల్ నుంచి ఓ మహానగరాన్ని నిర్మించాల్సిరావడం అంత తేలికైన విషయమేమీ కాదు. అది ఎంత అదృష్టమో..అంత పరీక్ష కూడా.

రాజధాని విషయంలో చంద్రబాబు ఎన్నో కసరత్తులు చేస్తున్నారని తెలుగు మీడియా కోడై కూస్తోంది. సింగపూర్ ప్లానింగ్, చంద్రబాబు హార్డ్ వర్క్ కలసి ఓ విశ్వనగరం త్వరలో రూపుదిద్దుకోబోతోందని ఆంధ్రా జనం కలలు కంటున్నారు. ఆ కలల్ని గ్రాఫిక్స్ తో పంచ రంగుల చిత్రాలుగా మీడియా ప్రచారం చేస్తోంది. అయితే చంద్రబాబు అంతా అనుకున్నట్టు రాజధాని ఇష్యూలో అంత సీరియస్ గా లేరా.. అన్న అనుమానాలు వచ్చే పరిస్థితి దాపురించింది.

ముందు రాజధాని కట్టుకునేవరకూ హైదరాబాద్ లోనే ఉండాలనుకున్నారు చంద్రబాబు. ఆ మేరకు హైదరాబాద్ ఆఫీసుకు కోట్లు తగలేసి ఆధునీకరణ పనులు చేయించారు. ఇంతలో నోటుకు వోటు మహిమో.. ఆంధ్రా గడ్డపై ప్రేమో తెలియదు కానీ.. ఉన్నట్టుండి బెజవాడ బాట పట్టారు. అక్కడి ఓ ప్రైవేటు గెస్ట్ హౌజులో మకాం పెట్టేశారు. దానికీ లక్షల రూపాయల అద్దెలు కడుతున్నారు. 

సింగపూర్ మాస్టర్ ప్లాన్ అందుబాటులోకి వచ్చేసినా.. పరిపాలన అర్జంటుగా అమరావతిలో మొదలుకావాలి కాబట్టి.. యమ అర్జంటుగా టెంపరరీగా సెక్రటేరియట్ కట్టేసుకోవాలనుకున్నారు. అప్పటివరకూ మేధా టవర్స్ లో ఆఫీసులు పెట్టాలనుకున్నారు. అంతవరకూ ఓకే. గుంటూరు సమీపంలోని అమరావతి టౌన్ షిప్ లో టెంపరరీ సెక్రటేరియట్ ను జెట్ స్పీడుతో కట్టాలనుకున్నారు. 

అనుకోవడమే తడవుగా ప్లాన్ రెడీ చేశారు. 90 కోట్లు నిధులు కూడా విడుదల చేశారు. ఇక పనులు ప్రారంభించడమే తరువాయి అనుకున్న తరుణంలో అకస్మాత్తుగా సెక్రటేరియట్ స్థలాన్ని అక్కడి నుంచి కోర్ కేపిటల్ అయిన రాయపూడి పరిసర ప్రాంతాల్లో కట్టాలని మళ్లీ నిర్ణయం మార్చుకున్నారు. సో.. అమరావతి టౌన్ షిప్ ప్లాన్ పక్కుకు వెళ్లింది. 

ఇప్పుడు రాయపూడి పరిసర ప్రాంతాల్లో టెంపరరీ సెక్రటేరియట్  కోసం స్థలం ఎంపిక ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ దాదాపు 200 కోట్లు పెట్టి టెంపరెరీగా ఎందుకు పర్మినెంటుగానే కట్టేద్దామని డిసైడయ్యారు.  ఐదు ప్రాంతాల్లో మట్టి సేకరించారు. ఎక్కడ కడితే భవనం గట్టిగా నిలబడుతుందోనని పరీక్షలు చేస్తారట. మొదట్లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ తో టెంపరరీగా కడదామనుకున్నారు. 

కానీ ఇప్పుడు పర్మినెంటుగా కడతారు కాబట్టి.. స్ట్రాంగ్ గానే కట్టాలని నిర్ణయించారట. ఇదంతా చూస్తే బాబు పాలన ఇంత అస్తవ్యస్తంగా ఉందా అని అనిపించక మానదు. అత్యంత కీలకమైన రాజధాని సెక్రటేరియట్ నిర్మాణంలో ఇంత ఆషామాషీగా నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు. 

ఇవన్నీ చంద్రబాబుకు తెలిసే జరుగుతున్నాయా.. లేక ఎవరైనా ఆయన్ను తప్పుదోవ పట్టిస్తున్నారా అన్న అనుమానాలు రాక మానవు. ఇప్పటికైనా చంద్రబాబు, అధికారులు ప్రచారం, హడావిడిపై స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే బావుంటుంది. లేకపోతే పాలనాదక్షుడన్న ఆయన పేరు పలుచన కావచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: