ప్రేక్షకుల చప్పట్లే నటీనటులకు ఉత్ప్రేరకాలు.. వాటి కోసం అసలు సిసలైన నటులు ఎంత కష్టమైనా పడతారు. కానీ ఎంత ప్రేక్షకాభిమానం ఉన్నా.. నటీ నటులకు అవార్డులు ఇచ్చే తృప్తి అంతా ఇంతా కాదు.. తమ నటనకు అవి సర్టిఫికెట్లలా వారు భావిస్తారు. అవార్డులు రాని వారు.. తమకు ప్రేక్షకుల చప్పట్లే గొప్ప అవార్డులని పైకి మాటవరుసకు అంటారు కానీ.. అవార్డుల కోసం వారి హృదయం తపిస్తూనే ఉంటుంది. 

ప్రభుత్వ అవార్డు అంటే అదో అధికారిక గుర్తింపు. అందుకే దానికి అంత విలువ. ఈ అవార్డుల కోసం సీనియర్ నటీనటులు కూడా ఎంతో తాపత్రయపడతారు. ఇప్పుడు ఈ విషయం మరోసారి రుజువైంది. ఆశా ఫరేఖ్ ప్రముఖ హిందీ నటి. ప్రేక్షకుల అభిమానం ఎంతగానో చూరగొన్న నటి. అంతేకాదు.. 1991లోనే ఆమెను ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది. 

కానీ ఆశాపరేఖ్.. తన టాలెంట్ కు కనీసం పద్మభూషణ్ అయినా దక్కాలనుకున్నారు. ఈరోజుల్లో అవార్డులంటే లాబీయింగ్ ద్వారానే వస్తున్నాయి. ఇలాంటి విమర్శలు సినీ ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. పాపం.. ఈ సీనియర్ నటీమణి కూడా పద్మభూషణ్ అవార్డు కోసం చాలా కష్టపడ్డారట. లాబీయింగ్ కోసం ఎందరినో కలిశారట. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని నాగ్ పూర్లో కలసి తనను పద్మభూషణ్ కోసం సిఫార్సు చేయమని కోరారట. 

ఇందులో పెద్దగా విచిత్రం ఏమీలేదు.. కానీ ఆశాపరేఖ్ గడ్కరీ ఇంటికి వెళ్లేసరికి ఆ ఇంట్లో లిఫ్ట్ పనిచేయలేదట. గడ్కరీ 12వ అంతస్తులో ఉన్నారు. మళ్లీ ఆయన అప్పుడు కలవకపోతే.. ఇంకోసారి ఎక్కడ దొరుకుతాడో చెప్పడం కష్టం. అందుకే పాపం అంత వయసులోనూ ఆ సీనియర్ నటీమణి 12 అంతస్తులు మెట్లెక్కి గడ్కరీని కలిశారట. ఈ విషయం స్వయంగా గడ్కరీయే చెప్పారు. 


ప్రభుత్వ అవార్డుల తీరు తెన్నులపై స్పందిస్తూ నితిన్ గడ్కరీ ఈ విషయం బయటకు చెప్పారు. సిఫార్సులు, లాబీయింగుల కారణంగానే అవార్డులు వస్తాయన్న సంగతి బహిరంగ రహస్యమైపోయిందని నితిన్ అన్నారు. ఈ  పరిస్థితి మారేందుకు అంతా కృషి చేయాలన్నారు గడ్కరీ. పాపం.. ఆశాపరేఖ్ 12 ఫ్లోర్లు మెట్లెక్కి వచ్చిన విషయం గడ్కరీ బయటపెట్టి ఆమెను మరీ ఇబ్బందుల్లో పడేశారేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: