ఎమ్మెల్యేలంటే ప్రజాప్రతినిధులు.. వాళ్లే అధికార కేంద్రాలు.. అందుకే ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు.. జీవితానికి సరిపడా ఆస్తులు సంపాదించుకుంటున్నారు. మరికొందరైతే ఏకంగా తమకూ, తమ వారసులకూ సరిపడా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. అందుకే ఎమ్మెల్యేలు ఆస్తులు వెల్లడించాలన్న నిబంధనలు వచ్చాయి. కానీ వీటిని పాటించేవారు ఎంతమంది..?

ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఆస్తులు ప్రకటించిన, ప్రకటించని వారి పేర్లు వెల్లడించింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికై రెండేళ్లు కావస్తున్నా ఇంకా దాదాపు చాలా మంది ఆస్తుల లెక్కలు చెప్పనేలేదు. మొత్తం ఆంధ్రా అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే... వారిలో కేవలం 46 మంది మాత్రమే ఆస్తుల చిట్టాలు బయటపెట్టారు. ఇంకా 129 మంది తమ ఆస్తి , అప్పుల వివరాలను అసెంబ్లీకి చెప్పనేలేదు. 

ఆస్తుల లెక్కలు చెప్పని వారిలో ప్రధానంగా విపక్షనేత వైఎస్ జగన్ ఉన్నారు. ఆయనతోపాటు ఆయన పార్టీకి చెందిన మొత్తం 52 మంది వరకూ తమ ఆస్తులు, అప్పుల వివరాలు ఇంకా ఇవ్వలేదట. ఇదే పార్టీకి చెందిన రోజా, రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, చరితారెడ్డి, రాజేంద్రనాథ్‌రెడ్డి, జగ్గిరెడ్డి, వెంకట్‌రెడ్డి, గిడ్డి ఈశ్వరి తదితరులు మాత్రం తమ వివరాలు బుద్దిమంతుల్లా అందజేశారు. 

ఇలా తమ ఆస్తుల లెక్కలు చెప్పని పెద్దలు అధికార పార్టీలోనూ ఉన్నారు. కొందరు మంత్రులు కూడా తమ గుట్టు విప్పడం లేదు. మొత్తం 14 మంది మంత్రులు ఇంకా తమ వివరాలు స్పీకర్ కు అందించలేదు. టీడీపీకి మొత్తం 102 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. వారిలో 29 మాత్రమే ఆస్తులు లెక్కలు చెప్పారు. 73 మంది చెప్పలేదు. 

వివరాలు చెప్పిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ ఉన్నారు. మంత్రుల్లో బొజ్జల  గోపాలకృష్ణారెడ్డి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కింజారపు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమమహేశ్వర్‌రావు,  కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర మాత్రమే ఆస్తుల వివరాలిచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: