ప్రేమికుల దినోత్సవం వేళ.. తమ ప్రేయసీప్రియులకు శుభాకాంక్షలు చెప్పుకుని ప్రేమ కబుర్లు చెప్పుకుందామని ఆశపడ్డ హైదరాబాద్ ప్రేమ జంటలకు భజరంగదళ్‌, విహెచ్‌పి వంటి సంస్థల కార్యకర్తలు చుక్కలు చూపించారు. హైదరాబాద్ లోని పార్కులు, రోడ్లు, సినిమా థియేటర్లు ఎక్కడ ప్రేమపక్షలు వాలితే అక్కడ వీరు ప్రత్యక్షమై హల్ చల్ చేశారు. 

పెళ్లికాకుండా ఇలా జంటలుగా తిరగడం మన సంస్కృతి కాదంటూ వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. మరికొందరు భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రేమపక్షల సెల్ ఫోన్లు లాక్కొని వారి పేరెంట్స్ కు వీరి సమాచారం అందించారు. మరికొందరిని హెచ్చరించి వదిలేశారు. ప్రేమికులు కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని భజరంగదళ్‌, విహెచ్‌పి వంటి సంస్థలు ముందే హెచ్చరించడంతో పోలీసులు కూడా భద్రత  ఏర్పాట్లు చేశారు.

ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా భజరంగదళ్‌, విహెచ్‌పి నేతలు పలు ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ కూడలి వద్ద విహెచ్‌పి నేతలు వ్యాలంటయిన్‌ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. కుషాయిగూడ, చైతన్యపురి, సురారం, కూకట్‌పల్లి, అబిడ్స్‌ తదితర ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.  

భజరంగదళ్‌, విహెచ్‌పిల హెచ్చరికలతో పార్కుల్లోనూ రద్దీ తగ్గిపోయింది. ఓయులో ప్రేమికుల దినోత్సవానికి అనుకూలంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఎన్‌ఆర్‌ఎస్‌ వసతి గృహం వద్ద కొందరు విద్యార్ధులు బెలూన్లు ఎగురవేయడానికి ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. 20 మంది విద్యార్ధులను పోలీసులు అరెస్టు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: