తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంత స్ట్రాంగ్ గా ఉంది. ఆయన ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. ఆయన్ను సవాల్ చేసే స్థాయి నాయకులు కానీ.. ఇబ్బంది పెట్టగలిగే నాయకులు కానీ కనిపించడం లేదు. వలసలను ప్రోత్సహిస్తూ  ప్రతిపక్షపార్టీలను దాదాపుగా జీరో చేసేస్తున్నారాయన. గ్రేటర్ ఎన్నికలు ఇచ్చిన జోష్ తో వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలకు వెళ్లిపోతున్నారు. 

కానీ ఏపీలో చంద్రబాబు పరిస్థితి అందుకు కాస్త భిన్నంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రతిపక్షాలు దాదాపుగా జీరోగా మారిపోతే.. ఇక్కడ మాత్రం జగన్ కాస్తో కూస్తో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. దీనికితోడు.. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో పెద్దగా ఎన్నికల ఊసే లేకుండా పోయింది. అయితే మరి ఇక్కడ స్థానిక సంస్థలు లేవా.. వాటికి ఎన్నికలు లేవా అంటే.. ఉన్నా వాటి ఎన్నికల విషయం గురించి చంద్రబాబు ఆసక్తి చూపించడం లేదు. 

ఐతే.. ఎన్నికలకు వెళ్తే.. తమ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటపడిపోతుందనే చంద్రబాబు ఎన్నికల జోలికి వెళ్లడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న  స్ధానాల్లో స్ధానిక సంస్దల ఎన్నికలను వెంటనే జరపాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. కార్పోరేషన్లు, మున్సిపాల్టీల పాలక వర్గం గడువు ముగిసినా.. ఎన్నికలు జరపకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. 

ప్రభుత్వ చర్య వల్ల కార్పోరేషన్ల కు కేంద్రం నుంచి వచ్చే నిధులు రాక అభివృద్ధి నిలిచిపోతోందని వైసీపీ ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్ర స్వామి విమర్శించారు. ప్రజల్లో వ్యతిరేకత దృష్ట్యా ఎన్నికల్లో గెలుపొందలేమని తెలిసే  ఎన్నికలపై టీడీపీ ప్రభుత్వం వెనక్కి వెళ్తోందని కోలగట్ల ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవెర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. 

చంద్రబాబుకు దమ్ముంటే వెంటనే స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ సవాల్ చేస్తోంది. మరి కేసీఆర్ లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి సత్తా చాటుతారా.. లేక మళ్లీ వాయిదా మంత్రమే జపిస్తారా.. చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: