ఏపీలో ఇప్పుడు చంద్రబాబు, జగన్ మధ్య పిల్లి ఎలుకా పోరాటం జోరుగా సాగుతోంది. జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు వివిధ రకాలుగా వల వేసి పట్టుకోవాలని చంద్రబాబు తీవ్రంగా ప్లాన్ చేస్తున్నారు. డబ్బు, కేసుల భయం వంటి కారణాలతో తమ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని వైసీపీ నేతలు వాపోతున్నారు. 

ప్రస్తుతానికి వైసీపీ నుంచి టీడీపీ వైపు వెళ్లిపోయిన వారి సంఖ్య 5గా ఉంది. ఇది పాతిక నుంచి 30 వరకూ వెళ్తుందని అనుకున్నా.. ప్రస్తుతం అంత జోరు కనిపించడం లేదు. ఈ వలసలపై కంగారు పడిపోయిన వైసీపీ తన పార్టీలో ఇంకా జంపింగ్ జపాంగులు ఎవరున్నారో కనుక్కునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా జరిపిన పరిశోధనలో ఎన్నో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలుగు చూశాయట. 

తమ పార్టీలో ఎవరెవరితో టీడీపీ మంత్రులు టచ్ లో ఉన్నారో అంతా తమ వద్ద ఆధారాలతో సహా ఉన్నాయంటున్నారు వైసీపీ ముఖ్యనేతలు. ఆ వివరాలన్నీ సమయం వచ్చినప్పుడు బయటపెడతామని వైసీపీనేత అంబటి రాంబాబు ప్రకటించారు. అయినా.. టీడీపీకి తమ గుర్తుపై గెలిచిన 102 మంది, బీజేపీకి చెందిన నలుగురు, స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇద్దరు మొత్తం 108 మంది బలం ఉన్నప్పుడు ఇంకా వలసలను ఎందుకు ప్రోత్సహిస్తుందో చెప్పాలని నిలదీశారు. 

సమాచార సేకరణలో ఆగకుండా.. వలస వెళ్లిన వైసీపీ నేతలను రాజీనామా చేయించేందుకు టీడీపీపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. అందుకే పార్టీకి చెందిన నేతలంతా దమ్ముంటే వలస ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలంటూ సవాల్ చేయిస్తున్నారు. కాకపోతే ఆ సవాళ్లకు స్పందించే టీడీపీ నేతలే కరవయ్యారు. స్పందన రాదని తెలిసినా పాపం వైసీపీ నేతలు మాత్రం సవాళ్లు విసురుతూనే ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: